తెలంగాణలో ఇంటర్ పరీక్షల రద్దు అంశంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో అధికారులతో మంత్రి సబిత బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేశామన్నారు. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడిస్తామని, ఇందుకు సంబంధించి త్వరలో విధి విధానాలను ఖరారు చేస్తామని కూడా చెప్పారు. అయితే విద్యార్థులెవరైనా పరీక్షలు రాయాలనుకుంటే పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆలోచిస్తామని, ఫలితాల వెల్లడిపై త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.