కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ద్వారా యాంటీబాడీల ఉత్పత్తి పుష్కలంగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. భారత్ లో తయారైన రెండు దేశీల వ్యాక్సిన్ల మధ్య ఇందుకు సంబంధించి తేడాను పరిశీలించినపుడు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ముందున్నట్లు స్పష్టమైంది. కరోనా వైరస్ పై పోరులో రెండు దేశీయ వ్యాక్సిన్ల సమర్ధతపై అహ్మదాబాద్‌లోని విజయ్రత్న డయాబెటిక్ సెంటర్, కోల్‌కతాకు చెందిన జీడీ హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్, జైపుర్‌లోని మహాత్మాగాంధీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి తదితర ఇన్స్టిట్యూట్లకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నాక ఏ స్థాయిల్లో అవి యాంటీబాడీలను ఉత్పత్తి చేశాయి? వాటి ఉత్పత్తిని ఏయే అంశాలు ప్రభావితం చేశాయి? అనే ప్రశ్నలు ప్రామాణికంగా అధ్యయనం చేశారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 22 నగరాల్లో 515 మంది ఆరోగ్య విభాగపు సిబ్బందిపై ఆయా సంస్థలు తాజా అధ్యయనాన్ని నిర్వహించాయి. కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నవారు 90 మందిని, కొవిషీల్డ్ తీసుకున్న 425 మందిపై అధ్యయనం చేశారు. ఆయా సంస్థల అధ్యయన నివేదిక ప్రకారం రెండో డోసు పూర్తయ్యాక కొవాగ్జిన్‌తో పోలిస్తే కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో యాంటీబాడీల స్థాయి ఎక్కువగా కనిపించింది. కొవిషీల్డ్ తీసుకున్నవారిలో 98.1 శాతంగా, కొవాగ్జిన్ గ్రహీతల్లో 80 శాతంగా అది నమోదు కావడం గమనార్హం.