మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారా? లేదా? ఇదీ తాజా సందేహం. ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేతలతో భేటీ అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం 10 గంటలకు శామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దాదాపు గంట సేపు మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్ అనేక అంశాలపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. పార్టీతో గల 19 ఏళ్ల అనుబంధానికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారా? లేదా? అనే అంశంపై సంశయం ఏర్పడింది. ఎందుకంటే ఈటెల తన ప్రసంగంలో ఎమ్మెల్యే పదవికి ‘రాజీనామా’ అనే పదానికి సంబంధించిన ముఖ్యాంశంపై ఏం మాట్లాడారో ఓసారి నిశితంగా పరిశీలిస్తే ఇదే అంశం బోధపడుతుంది.
‘‘ఈ మధ్య కాలంలో అనేక మంది నాయకులు చిలవలు, పలవులుగా నా గురించి మాట్లాడుతున్నారు. బంగారు పల్లెంలో పెట్టి ఎమ్మెల్యే సీటు ఇచ్చామంటున్నారు. ఫ్లోర్ లీడర్ పదవి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చామంటున్నారు. ఇంకా ఈటెలకు ఏమియ్యాలె? అని ప్రశ్నిస్తున్నరు. టీవీల్లో చూసిన నిన్ననో, మొన్ననో… ఎమ్మెల్యే పదవిని కూడా ఎట్లా తొలగించాల్నో ఆలోచిస్తున్నట్లుగా చెప్పిండ్లు. గంత ఇజ్జత్ తక్కువ బతుకు బతుకుతవా బిడ్డా? నువ్వు ఆనాడు తెలంగాణా ఉద్యమం కోసం రాజీనామా చేసినపుడు కడుపుల పెట్టుకుని కాపాడుకున్నం బిడ్డా… రేపు కూడా కాపాడుకుంటం. బతికి చెడొద్దు బిడ్డా… అని మా ప్రజలందరూ చెబుతున్నరు. హుజూరాబాద్ ప్రజలు ఆశీర్వాదం ఇచ్చినపుడు… ఇప్పుడే నా 19 సంవత్సరాల ఆ పార్టీ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి ఇవ్వాళే నేను రాజీనామా చేస్తున్నా. ఇవ్వాళ పార్టీ సభ్యత్వానికే కాకుండా, ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎమ్మెల్యే పదవికి… నువ్వు తొలగించాల్సిన అక్కరలేదు. నేను ఆత్మగౌరవాన్ని, ప్రజలను నమ్ముకున్న బిడ్డను. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న బిడ్డను. డబ్బును నమ్మకోను. ఆరుసార్లు గెల్చిన. లిక్కర్ బాటిల్ పంచలే… ఐదు పైసల బిళ్ల ఇయ్యలే. ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నరు. తప్పకుండా హుజురాబాద్ చరిత్రలో… ఇట్లాంటి దుర్మార్గాలను, అన్యాయాలను, డబ్బు సంచులను, కుట్రలను, కుతంత్రాలను, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలను తప్పకుండా బొందపెట్టే ప్రయత్నం చేస్తరు. ఇవ్వాళ హరీష్ రావులొచ్చినా, వినోద్ రావులొచ్చినా… తిరుగుబాటు చేస్తుండు… పార్టీ పెట్టబోతుండు… వాస్తవానికి నేనెప్పుడూ పార్టీ పెట్టే ప్రయత్న చేయలేదు. తిరుగబాటు ప్రయత్నం అంతకంటే చేయలేదు… మంచిని కోరిన నేను. మంచిగ బతకలాని కోరిన తప్ప… మరొకటి కాదు. ఇయ్యాల తప్పకుండా ఇప్పటికే హుజురాబాద్ ప్రజలను అడిగినం… తెలంగాణా వ్యాప్తంగా కొన్ని జిల్లాల ఉద్యమకారులను అడిగినం. భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా తెలియజేస్తామని ప్రకటిస్తున్నాం. సెలవ్… నమస్కారం.’’
ఇదీ ఈటెల రాజేందర్ తన పదవులకు సంబంధించి చేసిన రాజీనామా ప్రకటనలోని ముఖ్య సారాంశం. ఇంతకీ ఈటెల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన్నట్లు ప్రకటించినట్లా? లేదా? ఇదీ అసలు సందేహం.