శంకరన్న…అదేనండీ..మన మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్పినట్లే చేశారు. ‘నేను పాపం జేసి ఉంటే నిప్పుల్నే ఇదై పోవాలె గదా?’ అని ఎమ్మెల్యే ప్రశ్నించిన సంగతి తెలిసిందే కదా? ఈ మధ్య క్రిస్టియన్ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రెడ్లకు, వెలమలకు, డబ్బున్నవాళ్లకు, చదువుకున్నోళ్లకు ‘బలుపు’ ఉంటుందని శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వెలమలు స్పందించకపోయినా రెడ్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక చోట్ల నిరసనకు దిగారు, ప్రదర్శనలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవలసిందేనని డిమాండ్ చేశారు.
ఇదిగో ఈ నేపథ్యంలోనే శంకర్ నాయక్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ నిందించలేదని, మరెవరిపైనా వ్యాఖ్యలు చేయలేదని, ‘అబ్రహిం’ లింకన్ గురించి మాత్రమే ప్రస్తావించానని వివరణ ఇచ్చారు. తాను ఇరవై ఏళ్లుగా అయ్యప్ప మాల ధరిస్తున్నానని, అగ్నిగుండంలో నడుస్తున్నానని, తాను పాపం చేస్తే అగ్ని తనను దహించి వేసేదని వివరణ ఇచ్చారు. ఎప్పటిలాగే ఈనెల 27వ తేదీన అగ్ని గుండంలో నడుస్తానని, వచ్చి చూడాలని, తన పవిత్రతను కళ్లారా తిలకించాలని కూడా తన వ్యాఖ్యలపై నొచ్చుకున్నవారిని కోరారు. చెప్పిన మాట ప్రకారం శంకర్ నాయక్ శుక్రవారం రాత్రి మహబూబాబాద్ లోని అయ్యప్ప స్వామి నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అగ్నిగుండంలో శంకర్ నాయక్ నడిచి చూపించారు. తనకు పువ్వుల్లో నడిచినట్లు ఉందని కూడా శంకర్ నాయక్ ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు. నిప్పుల్లో నడిచిన శంకర్ నాయక్ పునీతత్వాన్ని రెడ్లు, వెలమలు, డబ్బున్నవాళ్లు, బాగా చదువుకున్నోళ్లు కళ్లారా తిలకించారో లేదో మరి. స్వామియే…శరణం అయ్యప్ప.