ప్రతి రెండేళ్లకోసారి జరిగేది మేడారం జాతర. ప్రతి 30 ఏళ్లకోసారి జరిగే ఉత్సవం ఆదివాసీ ‘ఇలవేల్పుల’ సమ్మేళనం. ఇది కూడా మేడారంలోనే జరుగుతుంది. ఈనెల 22, 23, 24 తేదీల్లో మేడారంలో జరిగిన ఆదివాసీ ఇలవేల్పుల సమ్మేళనం ఇదే. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. ఛత్తీస్ గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 700 మంది ఆదివాసీలు తమ ఇలవేల్పులను, దేవతలను ఒకేచోటకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రోజులపాటు మేడారంలో నిర్వహించిన ఈ పూజల గురించి మీడియాలో వచ్చిన కథనాలు వేరు… ఇందులో దాగి ఉన్న వాస్తవం వేరు కావడమే ఇక్కడ అసలు విశేషం.
మేడారం జాతర ప్రాశస్త్యం, కాకతీయ సైన్యంపై వనదేవతలైన సమ్మక్క-సారలమ్మల వీరోచిత పోరాటం, తమ జాతి పరిరక్షణ కోసం వాళ్లు చేసిన బలిదానం గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆ వనదేవతల వారసులైన ఆదివాసీల అసలైన ఆచారాలను ఇప్పటి తరానికి తెలియ జెప్పేందుకు చేసిన ప్రయత్నమే ‘ఇలవేల్పుల సమ్మేళనం’. కట్టుబొట్టు, సంప్రదాయం, ఆచారం, కుల, గోత్రాల వంటి అంశాలు అన్ని వర్గాలకు, అన్ని తెగలకు ఉంటాయి. కానీ ఆదివాసీ తెగల్లో గల ‘గొట్టు’ అనే పదమే వారి ఆచార, వ్యవహారాల్లో అసలు ప్రత్యేకత. వాస్తవానికి ఈ ‘గొట్టు-గోత్రం’ గురించి ఈ తరం ఆదివాసీ తరానికి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా పెళ్లి సంబంధాల సందర్భంగా మనం ఎక్కువగా కులం, గోత్రాల గురించి పట్టించుకుంటుంటాం. ప్రేమ వివాహాల సంగతి వదిలేస్తే, పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు మాత్రం కుల, గోత్రాలే పట్టింపులుగా ఉంటాయి. తమ కులం వారిని మాత్రమే వివాహం చేసుకునే పద్ధతి లేదా ఆచారం లేదా సంప్రదాయం దాదాపు అన్ని కులాల్లో ఉంటుంది.
కానీ ఆదివాసీ ‘గొట్టు-గోత్రం’ పద్ధతి ఇందుకు పూర్తిగా భిన్నం. ఆదివాసీ గిరిజన పరిభాషలో గొట్టు అనేది ఓ అంకె. 3 నుంచి 7 వరకు ఉండే సంఖ్యలను ఆదివాసీలు గొట్టుగా వ్యవహరిస్తుంటారు. ఒక్కో వంశానికి, ఇంటి పేరుకు ఓ గొట్టు, గోత్రం ఉండడమే ఆదివాసీ ఆచారాల్లో ప్రత్యేకత. ఓ గొట్టు వారిని అదే గొట్టు గల వారు అస్సలు పెళ్లి చేసుకోరు. ఇదీ గొట్టుకు ఉన్నటువంటి కట్టుబాటు. ఉదాహరణకు ‘పూనెం’ అనే ఇంటి పేరు గలవారి గోత్రాన్ని 3వ గొట్టుగా వ్యవహరిస్తుంటారు. ఇంటి పేరు వేరైనప్పటికీ గొట్టు అంటే 3వ నెంబర్ ఉంటే ఆ ఇంటి పేరుకు చెందిన యువతినిగాని, యువకున్నిగాని మరో ఇంటి పేరు గల వారు పెళ్లి చేసుకోరు. ఒకే గొట్టుకు చెందినవారు పెళ్లి సంబంధాలు కురుర్చుకోకపోవడం ఆదివాసీ తెగల కట్టుబాట్లో కఠిన ఆచారం, ఉల్లంఘిస్తే శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. గొట్టు, గోత్రం ఆధారంగానే ఆదివాసీ తెగలకు ఇలవేల్పులు ఉండడం విశేషం. అవేమిటో ఓసారి పరిశీలిద్దాం.
3వ గొట్టు ఇలవేల్పులు: సమ్మక్క-సారలమ్మ, ఉరయ మారయ్య, పిడగర్నాలు, ఇరమరాజు, నాగరాజు, జలసంగరాజు, పిడగరాజు, తాటి, పెద్ద ఒరమారో
వంశీకులు: పూనెం, ఇర్సుల గంగ, ఇదరగంగ, ఏడుకొప్పుల, మారో, కుర్సం, తంగెళ్ల, మడకం, గొల్లపల్లి, మచ్చ
4వగొట్టు ఇలవేల్పులు: పగిడిద్దరాజు, పెద్ద గోవిందరాజు, గడి కామరాజు, ముల్ల అరుడు
వంశీకులు: అర్రెం, సనప, మాడి, సోయం, పర్శిక, గుండి, గట్టి
5వ గొట్టు ఇలవేల్పులు: కొమ్మాలమ్మ, బాలకుమారుడు, బంగారు వజయ్య, జలదేవి
వంశీకులు: వాసం, చంచు, వజ్జ
6వ గొట్టు ఇలవేల్పులు: గాదెరాజు, బాపనమ్మ, పెద్ద రాముడు
వంశీకులు: కొమరం, తుర్సం (బండ్ల)
7వ గొట్టు ఇలవేల్పులు: ముసలమ్మ, గంటెల కామరాజు, గంగల కామ రాజు, గడి కామరాజు
వంశీకులు: బెండబోయిన, తోలెం, పూనెం
మేడారంలో జరిగిన ఆదివాసి ఇలవేల్పుల సమ్మేళనపు దృశ్యాలు
ఆయా గొట్టు, గోత్రాలు, ఇలవేల్పుల వివరాలు ఛత్తీస్ గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు తెలంగాణాలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన వివరాలు మాత్రమే. ఖమ్మం మినహా తెలంగాణాలోని మిగతా ఆదివాసీ తెగలకూ గొట్టు, గోత్రాలు ఉంటాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన గొట్టు, గోత్రాలను బేరీజు వేసుకుని స్థానిక ఆదివాసీలు సంబంధాలను కలుపుకుంటుంటారు. మొత్తంగా ఇవీ వనదేవతల వంశీకులైన ఆదివాసీ గిరజనుల ‘గొట్టు-గోత్రాల’ విశేషాలు.