అనగనగా ఓ న్యూస్ ఛానల్. దానికి ఓ సీఈవో, ఔట్ పుట్, ఇన్ పుట్ ఎడిటర్ అనే హోదాలు గల బాధ్యతాయుత పోస్టులు కూడా ఉంటాయి. కొత్త న్యూస్ ఛానల్ కాబట్టి దాని ఏర్పాటు, నిర్మాణం, సిబ్బంది నియామకం అబ్బో బోలెడు తతంగం ఉంటుంది లెండి. ఇక జిల్లాల వారీగా రిపోర్టర్ల నియామకం ప్రక్రియ కూడా ఉంటుంది. ప్రతి జిల్లాకు ఇంచార్జ్/స్టాఫ్ రిపోర్టర్/బ్యూరో ఇంచార్జ్ పేరుతో నియామకాలు జరుగుతాయి. మారిన జర్నలిజపు వింత పోకడల నేపథ్యంలో ‘ఇన్ పుట్’ ఎడిటర్ ఆదేశం ప్లస్ ఉత్తర్వు ప్రకారం జిల్లాల ఇంచార్జిలు తమ జేబులో ఉన్నది కాస్తా ఊడ్చి అతని చేతిలో పెట్టారు. తమకు బతుకు దెవురు లభిస్తుందనే నమ్మకంతో, ఎన్నో ఆశలతో ఇన్నాళ్లపాటు కష్టపడి సంపాదించుకున్న మొత్తాన్ని ఇన్ పుట్ ఎడిటర్ కు మనస్ఫూర్తిగా సమర్పించుకున్నారు.
అయిదేళ్ల కాలం గడిచిందే తప్ప, ఎంతకీ న్యూస్ ఛానల్ ప్రసారాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. తాత్కాలికం పేరుతో స్టూడియో నిర్మించి ట్రయల్ బులెటిన్లు రన్ చేస్తున్నారే తప్ప, బ్రేకింగ్ స్థాయిలో ప్రసారాలు మాత్రం జనంలోకి వెళ్లలేదు. స్టూడియో నిర్మాణమే పక్కాగా జరగనప్పుడు ఇదంతా జరిగే ప్రసక్తే లేదు. ఛానల్ నిర్మాణం పూర్తి కాకపోతుందా? తమ బతుకులు బాగు పడకపోతాయా? అని ఇన్ పుట్ ఎడిటర్ కు ఉన్నదంతా ఊడ్చిపెట్టిన జిల్లా రిపోర్టర్లు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఇధిగో…వచ్చె. అదిగో…వచ్చె అంటూ ఛానల్ సీఈవో సహా ‘ఇన్ పుట్’ ఎడిటర్ కూడా రిపోర్టర్లను మభ్యపెట్టసాగారు.
ఎంతో నమ్మకంతో బాధ్యత అప్పగిస్తే ఈ సీఈవో, ఇన్ పుట్టు, అవుట్ పుట్టు ఎడిటర్లు ఎంతకీ ఛానల్ ను పూర్తి స్థాయిలో నిర్మించడం లేదని, వీరివల్ల అయ్యేట్టు లేదని భావించిన యాజమాన్యం టాప్ టూ బాటమ్ బాధ్యులను మార్చేసింది. అంటే సదరు ఛానల్ సీఈవో సహా ఇన్ పుట్ ఎడిటర్ వరకు అందరూ ఔట్…అన్నమాట. ఛానల్ యాజమాన్యం మరో కొత్త సీఈవోను నియమించింది. సీఈవో మారాక సహజంగానే ఇన్ పుట్, అవుట్ పుట్ ఎడిటర్లు కూడా మారారు. వీళ్లు బాధ్యతలు చేపట్టిందే తడవుగా ఛానల్ పూర్తి స్థాయి నిర్మాణానికి నడుం కట్టారు. అసలు స్టూడియో నిర్మాణమే అపసవ్యంగా ఉందని, అంతా తాత్కాలిక బాగోతమేనని, గ్రాఫిక్ సినిమా చూపించి బాధ్యత అప్పగించిన యాజమాన్యాన్ని మోసం చేశారని లెక్కలు చెప్పింది. కెమెరాల కొనుగోళ్లలో, రిపోర్టర్ల నియామకంలో అన్నీ అక్రమాలేనని, ఓ రకంగా ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ఇందుకు పాత సీఈవో సహా అందరూ బాధ్యులేనని ఛానల్ కొత్త బాధ్యులు ఆరోపణలు చేశారు.
ఛానల్ ను సక్రమంగా నిర్వహించాలంటే ప్రస్తుత స్టూడియోను మరోచోట నిర్మించాలని, ఇప్పటి వరకు చేసిన నియామకాలను రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. ఈమేరకు జిల్లాల ఇంచార్జిలను కూడా తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో ఛానల్ రాకముందే ఉన్నదంతా ఊడ్చి సమర్పించుకున్న జిల్లా రిపోర్టర్లు రోడ్డున పడ్డారు. ఇప్పుడు చెప్పండి…ఆ జిల్లా రిపోర్టర్లు ఏం చేయాలి? ఎవరిని ప్రశ్నించాలి? తాము ఇన్ పుట్ ఎడిటర్ కు సమర్పించిన సొమ్ము, సొత్తు సంగతి ఏమిటని జిల్లా రిపోర్టర్లు ప్రశ్నిస్తున్నారు. తాము అన్యాయమైపోయామని ఆక్రోశిస్తున్నారు. రోడ్ల పైకి వచ్చి తమకు న్యాయం చేయాలని నినదిస్తున్నారు. దీనికి బాధ్యులెవరు? ఛానల్ రాకముందే, ఉద్యోగం ఓ రేవుకు రాకముందే, ఇన్ పుట్ ఎడిటర్ కు ఇచ్చిన సొమ్ము నిరర్ధకమైతే ఆ జిల్లా రిపోర్టర్లు ఎవరిని నిందించాలి? జిల్లా రిపోర్టర్ల సొమ్మును కొత్త ఛానల్ పేరుతో స్వీకరించిన ‘ఇన్ పుట్టు’ ఎడిటర్ నా? సొమ్ము ప్లస్ సొత్తు సమర్పించిన జిల్లా రిపోర్టర్ నా? ఇందులో బాధితులెవరు? బాధ్యులెవరు? నిరర్ధకమైన ‘పెట్టుబడి’కి సార్థకత చేకూరేదెలా? అంతా అయోమయం, గందరగోళం.
(ఇది కల్పిత కథ కాదు. ఓ అభాగ్య విలేకరి తన దీన స్థితిపై విలపించిన వాస్తవిక గోడు. మరే ఇతర అంశానికి ఈ వ్యథను అన్వయించుకోవద్దు)