యాదృచ్ఛికమే కావచ్చు…ఇందులో తప్పు పట్టడానికి కూడా ఏమీ లేకపోవచ్చు…కార్యనిర్వహణలో భాగంగా ప్రభుత్వం 24 గంటలూ పనిచేయవచ్చు. పరిపాలనా సౌలభ్యం కోసం ఏ అధికారినైనా, ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండవచ్చు. ఆపద సమయంలో అత్యవసర నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఇందులో ఏ సందేహమూ లేదు. కానీ అర్జంటుగా వచ్చిన ఆ ఆపద ఎటువంటిది? అన్నదే కదా.. అసలు ప్రశ్న.
బహుషా చాలా మంది ప్రత్యేకంగా గమనించని అంశం కావచ్చు ఇది. తెలంగాణాలో రెండు జిల్లాల పాలనా వ్యవహారాలు చూస్తున్న ఇద్దరు కలెక్టర్లను కాకతాళీయంగా ప్రభుత్వం ఆదివారం రోజే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చకు కూడా దారి తీసింది. ముందే చెప్పుకున్నట్టు ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ అధికారినైనా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం పాలకులకు ఉంది. అయితే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక రాజకీయ దృశ్యాలు కనిపిస్తున్న పరిస్థితుల్లో సెలవు రోజైన ఆదివారం బదిలీల ఉత్తర్వులు వెలువడడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోవడమే అసలు విశేషం. అదీ…వారం రోజుల వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
ఇటీవలి వరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి సర్ఫరాజ్ అహ్మద్ ను ఈనెల 15వ తేదీన (ఆదివారం) బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల వ్యయం తీరుపై ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోర్టును ఆశ్రయించారు. కమలాకర్ ఎన్నికల ఖర్చుకు సంబంధించి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, బండి సంజయ్ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో లీక్ కావడం రాజకీయ కలకలానికి దారి తీసింది. నవంబర్ 16న ఆడియో లీక్ కాగా, నెల రోజుల వ్యవధిలోనే ఈనెల 15వ తేదీన సర్ఫరాజ్ అహ్మద్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
అదేవిధంగా తాజాగా ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈనెల 22న (ఆదివారం) ఉత్తర్వు జారీ చేసింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగైన మేడారం జాతరకు పట్టుమని 40 రోజుల వ్యవధి కూడా లేని పరిస్థితుల్లో, అక్కడ రూ. 75 కోట్ల విలువైన జాతర సౌకర్యాల కల్పన పనులు సా…గుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ములుగు కలెక్టర్ నారాయణరెడ్డిని అకస్మాత్తుగా బదిలీ చేయడం భిన్నాభిప్రాయాలకు తావు కల్పించింది. వాస్తవానికి నారాయణరెడ్డి వివాదాస్పద అధికారి కూడా కాదు. అతి తక్కువ సమయంలోనే ములుగు జిల్లా ప్రజల అభిమానాన్ని విశేషంగా చూరగొన్న ఐఏఎస్ అధికారి. ఆయన బదిలీని సామాన్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారంటే నారాయణరెడ్డి పనితీరును అవగతం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ ఇద్దరు అధికారులకు లభించిన పోస్టింగ్ లు ‘పనిష్మెంట్’ తరహా కూడా కాకపోవడం గమనార్హం. సర్ఫరాజ్ అహ్మద్ కు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా అవకాశం లభించగా, కేవలం ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంతో కూడిన ములుగు వంటి అతి చిన్న జిల్లా నుంచి నిజామాబాద్ వంటి జిల్లాకు కలెక్టర్ గా నారాయణరెడ్డికి అవకాశం లబించింది. ఓ రకంగా నారాయణరెడ్డి కెరీర్ కు ఈ పోస్టింగ్ మైలురాయి వంటిది కూడా.
కానీ ఈ ఇద్దరు కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేయడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతల ప్రయోజనం ఇందులో దాగి ఉందనేది ఈ ప్రచారపు సారాంశం. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతల ‘సారు-కారు-పదహారు’ నినాదానికి బీజేపీ గండి కొట్టిన సంగతి తెలిసిందే కదా? గులాబీ జెండా రెపరెపలు కేవలం తొమ్మిది పార్లమెంట్ స్థానాలకే పరిమితమయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీ తన కాషాయ జెండాను ఎగురవేసింది. కేసీఆర్ కూతురు కవిత, ఆయన కుడి భుజం బోయినపల్లి వినోద్ కుమార్ నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఇది గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కే కాదు, ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలకు మింగుడు పడని అంశంగానే మిగిలింది. మరోవైపు గడచిన ఎనిమిది నెలల కాలంలో నిజామాబాద్, కరీంనగర్ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ లు అనేక అంశాల్లో అధికార పార్టీకి కొరకరాని కొయ్యలుగా మారారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీళ్ల ‘దూకుడు’ వ్యవహారం కారణంగా ఆయా జిల్లాల్లో బీజేపీ ప్రాబల్యం రోజురోజుకూ పెరుగుతున్నదట. అందువల్లే అటు నిజామాబాద్ లో, ఇటు కరీంనగర్ లో కలెక్టర్లను మార్చక తప్పని అనివార్య పరిస్థితులు ఏర్పడినట్లు చర్చ జరుగుతోంది.
బీజేపీ రాజకీయ ప్రాబల్యానికి కలెక్టర్లు ఏం చేస్తారనే సందేహం అక్కరలేదు. సమర్థులైన అధికారులు గులాబీ జెండా కప్పుకున్న చందంగా కార్యనిర్వహణ చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పాలన సాగిస్తే చాలునట. అది పార్టీకి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నది అధికార పార్టీ వర్గీయుల నిర్వచనం. అందువల్లే నారాయణరెడ్డి వంటి కలెక్టర్ ను కేసీఆర్ కూతురు కవితతోపాటు ఆ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పట్టుబట్టి మరీ నిజామాబాద్ కు అర్జంట్ గా బదిలీ చేయించుకున్నారట. ఇక కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విషయంలో మంత్రి గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గుర్రుగా ఉన్న సంగతి గురించి కొత్తగా చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. పైగా ఎంపీ బండి సంజయ్ తో ఫోన్ మంతనాల వ్యవహారపు వివాదం ఉండనే ఉంది.
ఇదిగో ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ‘ఆపద’ అధికార పార్టీ నేతలను తరుముకొచ్చిందట. పురపాలక సంఘ ఎన్నికల నగారా మోగడానికి సరిగ్గా పది రోజుల మందు కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఒక్క రోజు ముందు ములుగు కలెక్టర్ నారాయణరెడ్డిల బదిలీ ఉత్తర్వులు వెలువడడం ఇందుకేనట. ఈ ఇద్దరి కలెక్టర్ల బదిలీ ఉత్తర్వులను మరోసారి పరిశీలించండి. యాదృఛ్చికంగా ఆ రెండు ఉత్తర్వులు వెలువడిన తేదీలు సెలవు రోజైన ఆదివారమే! అదీ సంగతి.