ఇంకా నలభై రోజులు మాత్రమే వ్యవధి. అక్కడ అక్షరాలా రూ. 75 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నిర్దేశిత గడువు లోపు ఇంత భారీ మొత్తపు నిధుల పనులన్నీ పూర్తి కావలసిందే. పనుల పూర్తికి గడువు పొడిగించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అక్కడ తెలంగాణా కుంభమేళా జరగబోతున్నది. కోటిన్నరకు పైగా భక్తులు తమ ఆరాధ్య దేవతలను దర్శనం చేసుకునేందుకు ఆ ప్రాంతానికి రానున్నారు. ఇదిగో ఈ పరిస్థితుల్లో ఆ కొత్త జిల్లాను సమర్థవంతంగా పరిపాలిస్తున్న కలెక్టర్ ను ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసింది. ఇలా ఎందుకు జరిగింది? అసలు ప్రభుత్వ ఆలోచన ఏమిటి? ప్రజల్లో తలెత్తుతున్న అనేక ప్రశ్నలు ఇవి. విషయం అర్థమైంది కదా? ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచిన మేడారం జాతర నిర్వహణ తేదీ సమీపిస్తున్న తరుణంలో ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని తెలంగాణా ప్రభుత్వం ఆకస్మిక బదిలీ చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది.
గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగమైన ములుగు నియోజకవర్గం కేంద్రంగా ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆవిర్భవించిన ములుగు జిల్లా తొలి కలెక్టర్ గా నారాయణరెడ్డి అనే ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈమేరకు గత మార్చి 4వ తేదీన నారాయణరెడ్డి పదవీ బాధ్యతలు కూడా స్వీకరించారు. పట్టుమని పది నెలల పదవీ కాలం కూడా పూర్తి కాకముందే కలెక్టర్ బదిలీ కావడం, అందులో మేడారం జాతరకు సంబంధించి రూ. 75 కోట్ల విలువైన పనులు సాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ పై బదిలీ వేటు వేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో వాస్తవ, అవాస్తవాల సంగతి ఎలా ఉన్నప్పటికీ మేడారం అభివృద్ధి పనులకు సంబంధించి డెడ్ లైన్ విధింపు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తదితర అంశాల నేపథ్యంలోనే కలెక్టర్ బదిలీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి మేడారం భక్తుల సౌకర్యాల కల్పనకు సంబంధించి ప్రభుత్వమే చాలా ఆలస్యంగా నిధులు విడుదల చేసింది. కేవలం రెండు నెలల ముందు రూ. 75 కోట్ల నిధులను విడుదల చేసిన ప్రభుత్వం జాతర తేదీలు తరుముకొస్తున్న నేపథ్యంలో అధికారులపై ఒత్తిడి పెంచిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే జాతర సౌకర్యాల్లో ఏ విభాగపు పనులు కూడా ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం గమనార్హం. బుధవారంనాటి తాజా సమాచారం ప్రకారం పంచాయత్ రాజ్, ఐటీడీఏ, ఆర్అండ్ బీ విబాగాలకు చెందిన పనులు 50 శాతం వరకు పూర్తయ్యాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి చెందిన పనులు 30 శాతం కూడా పూర్తయిన దాఖలాలు లేవు. శాశ్వత షెడ్లు, వాటర్ ట్యాంక్ లు, మరుగుదొడ్ల వంటి నిర్మాణపు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 31వ తేదీలోపు జాతర పనులు పూర్తి కావలసిందేనని కలెక్టర్ నారాయణరెడ్డి డెడ్ లైన్ విధించారు. వాస్తవానికి జాతర పనుల పూర్తికి సంబంధించి ఇటువంటి డెడ్ లైన్లు విధించడం, జాతర ప్రారంభమైన రోజు కూడా పనులు జరగడం కొత్తమే కాదు. ప్రతి జాతరలోనూ అధికార యంత్రంగానికి ఇదో తంతు. సౌకర్యాల లేమి కారణంగా ఇక్కట్ల పాలు కావడం సైతం భక్తులకు అలవాటుగానే మారిందని చెప్పక తప్పదు.
ఈ నేపథ్యంలోనే కలెక్టర్ నారాయణరెడ్డిని బదిలీ చేస్తూ ఈనెల 22న ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఆయనను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వి. వెంకటేశ్వర్లుకు ములుగు జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు నారాయణరెడ్డి రిలీవై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులతో భాగస్వామ్యం ఉన్నట్లు ప్రచారం గల కొందరు కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకే జాతరకు 40 రోజుల ముందు కలెక్టర్ ను ప్రభుత్వం బదిలీ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా పనుల నిర్వహణలో కాంట్రాక్టర్లకు ఒత్తిడి తగ్గి, ఇష్టానుసారంగా పనులు చేసుకునే వెసులుబాటు లభించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ ఆకస్మిక బదిలీతో తాజాగా బాధ్యతలు తీసుకున్న అధికారికి జాతర పనులపై అవగాహన కలిగి, పట్టు లభించే లోపు జాతర కూడా ముగుస్తుందని, పనులు చేస్తున్న కొందరు కాంట్రాక్టర్ల భారీ లబ్ధి కోసమే ములుగు కలెక్టర్ నారాయణరెడ్డిని ఆకస్మిక బదిలీ చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
ఇదిలా ఉండగా నారాయణరెడ్డి బదిలీపై మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అధికార పార్టీ నేతలకు ప్రస్తుతం కలెక్టర్ నారాయణరెడ్డి వంటి అధికారి అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ప్రాబల్యం దెబ్బకు గత పార్లమెంట్ ఎన్నకల్లో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమి బాట పట్టిన సంగతి తెలిసేందే కదా? ప్రస్తుతం కూడా బీజేపీ ఆధిపత్యం మరింతగా కొనసాగుతోందని, స్థానిక అధికారులు కొందరు అధికార పార్టీ నేతల మాటలనే కాదు, చివరికి మంత్రుల స్థాయి ప్రజాప్రతినిధుల ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా తరుముకు వచ్చాయి. పరిస్థితుల డిమాండ్ మేరకు, మాజీ ఎంపీ కవిత, ఆ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షల మేరకు ములుగు కలెక్టర్ నారాయణరెడ్డిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నియమించారని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల నగరా మోగిన ఒక్కరోజు ముందుగానే కలెక్టర్ నారాయణరెడ్డి బదిలీ ఉత్తర్వు వెలువడడం ఈ సందర్భంగా గమనార్హం. ఏ ప్రచారం సంగతి ఎలా ఉన్నప్పటికీ, గత జాతర సమయంలోనూ, కొద్ది రోజుల ముందు అప్పటి ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళిని కూడా ప్రభుత్వం బదిలీ చేయడం కొసమెరుపు.