ఈ ఫోటోను జాగ్రత్తగా పరిశీలించండి. ముదిరాజ్ వన సమారాధన కార్యక్రమానికి సంబంధించిన పబ్లిసిటీ బ్యానర్ ఇది. కుడి వైపున మంత్రి ఈటెల రాజేందర్ ఫోటో ఉంది చూశారు కదా? ఎడమ వైపున గల ప్రముఖ వ్యక్తి ఎవరో తెలుసు కదా? ఔను…మన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. శీతాకాల విడిది కోసం శుక్రవారం హైదరాబాద్ కు వచ్చిన కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి కూడా చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి బహుశా ముదిరాజ్ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొంటారు కాబోలు అని భావిస్తే మీరు పొరబడినట్లే.
ఎందుకంటే ఈ వనసమారాధన కార్యక్రమం జరిగేది హైదరాబాద్ నగరంలోనో, పరిసరాల్లోనో కాదు. హైదరాబాద్ కు 200 కి.మీ. దూరంలో గల ఖమ్మం నగరంలో. ఈ ఆదివారం అంటే ఈనెల 22వ తేదీన ముదిరాజ్ వన సమారాధన నిర్వహిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, మంత్రి ఈటెల రాజేందర్ తదితర ముదిరాజ్ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. మరి మన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫొటో బ్యానర్ పై ఎందుకు పెట్టారు? అనేగా ప్రశ్న. తెలంగాణాలోని స్థానిక లెక్కల ప్రకారం రామ్ నాథ్ కోవింద్ తమ సామాజిక వర్గానికే చెందుతారని వన సమారాధన నిర్వాహక కమిటీకి చెందిన ముదిరాజ్ ప్రముఖుడు ఒకరు వెల్లడించారు. అందువల్లే బ్యానర్ పై ఆయన ఫొటో వాడుకున్నట్లు చెప్పారు. ఖమ్మం బస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది.