కరోనాతో మృతి చెందినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన గిరిజమ్మ అనే వృద్ధురాలు ఇంటిముందు కనిపించేసరికి ఆమె కుటుంబ సభ్యులు కాసేపు భయభ్రాంతులకు గురయ్యారు. ఆటోలో దర్జాగా ఇంటిముందు దిగిన గిరిజమ్మను చూసి ఇరుగు పొరుగువారు పరుగులు కూడా తీసిన ఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో బుధవారం చోటు చేసుకుంది. తాను ఆసుపత్రి నుంచే వచ్చానని, తనను నమ్మండి అంటూ గిరిజమ్మ మొత్తుకోక తప్పలేదు. ఈ పరిణామం నుంచి చాలాసేపటి వరకు గాని తేరుకోని గిరిజమ్మ కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యాలతో ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్లారు.
ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం… గత నెలలో కరోనా బారినపడి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముత్యాల గిరిజమ్మను ఆసుపత్రి సిబ్బంది వేరే వార్డుకు మార్చారు. గిరిజమ్మ బెడ్ పై లేకపోవడంతో ఆమె భర్త ఆసుపత్రి సిబ్బందిని ఆరా తీశాడు. అయితే ‘మార్చురీలో నీ భార్య మృతదేహం ఉన్నదేమో చూసుకోండి’ అని సిబ్బంది విసుక్కున్నారు. మార్చురీలో తన భార్య గిరిజమ్మ పోలికలతో గల మృతదేహాన్ని చూసి గిరిజమ్మ మృతదేహంగా ఆమె భర్త భావించారు. గత నెల 15న గిరిజమ్మ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆమె మృతదేహాన్ని జగ్గయ్యపేటకు తెచ్చిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా చేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకే గిరిజమ్మ కుమారుడు రమేష్ కూడా కరోనాతో మృతి చెందాడు. ఇద్దరి కర్మ కాండలు రెండ్రోజుల క్రితం చేశారు. కానీ గిరిజమ్మకు తన కుమారుడు చనిపోయిన విషయం తెలియదు.
ఈ పరిణామాల్లోనే గిరిజమ్మ ఆటోలో ఇంటి ముందు దిగడం గమనార్హం. ఆసుపత్రిలో తనను బాగా చూసుకున్నారని, వారే డబ్బులిచ్చి ఆటో ఎక్కించి ఇంటికి పంపారని గిరిజమ్మ చెబుతున్నారు. చనిపోయిందనుకున్న తల్లి ఒక్కసారే కళ్ల ముందు కనబడే సరికి భయమేసిందని, అమ్మ మళ్లీ ఇలా రావడం చాలా సంతోషంగా ఉందని, అమ్మ చనిపోయిందనే ఆవేదనతో తానూ చనిపోదామనుకున్నానని గిరిజమ్మ కూతురు సౌజన్య చెప్పారు. తాను తన భార్య ను సరిగ్గా గుర్తు పట్టలేక పోయానని, అవే పోలికలతో వున్న మృతదేహాన్ని చూసి ఆమె అనుకున్నానని గిరిజమ్మ భర్త చెప్పారు. తన భార్య తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నా, కొడుకు కరోనా కాటుకు బలి కావడం బాధగా ఉందని ఆయన అన్నారు.
అయితే గిరిజమ్మ కుటుంబీకులు అంత్యక్రియలు చేసిన మృతదేహం ఎవరిది? వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వర్గాలు ఎవరి మృతదేహాన్ని ఇచ్చారు? ఇవీ ఇప్పుడు విజయవాడ ప్రభుత్వాసుపత్రి వర్గాల ముందు గల ప్రశ్నలు. ఈ ఘటన జగ్గయ్యపేటలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఫొటో: గిరిజమ్మ