‘‘అశ్లీల వెబ్ సైట్లపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అశ్లీల వెబ్ సైట్ల పూర్తి వివరాలను అందించాలని గూగుల్ సంస్థకు నోటీసులు జారీచేసింది. పేస్ బుక్ ఫోటోలను మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లలో పెడుతున్నారని, తన పేరు, ఫోటోలను పోర్న్ వెబ్ సైట్ల నుండి తొలగించాలని గతంలో గూగుల్ సంస్థకు తాను ఫిర్యాదు చేయగా, గూగుల్ సంస్థ స్పందించలేదని బాధిత యువతి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు పూర్తి వివరాలను అందించాలని గూగుల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.’’
గత ఆగస్టులో జరిగిన ఘటనకు సంబంధించిన వార్త ఇది. ఇందుకు సంబంధించి తర్వాత అప్ డేట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ, అశ్లీల వెబ్ సైట్లే కాదు, సీరియళ్లు, సినిమాలు కూడా మహిళలపై అనేక హింసాత్మక ఘటనలకు ఓ కారణంగా మనం తిట్టి పోస్తుంటాం కదా! సందర్భానుసారం కవులు, రచయితలు, పాత్రికేయులు, విశ్లేషకులు ఒకరేమిటి అనేక వర్గాలకు చెందిన వారు పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు, వార్తా కథనాలు రాస్తుంటారు కూడా. నిర్భయ ఘటన నుంచి ఉన్నావ్ ఉదంతం వరకు, నిన్న మొన్నటి దిశ, సమత వంటి దురాగతాల వరకు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ అంశంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తన దృష్టికి వచ్చిన నమ్మలేని నిజాలపై ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకింత విస్మయం కూడా చెందారు. తమిళనాడు రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న అదనపు డీజీపీ రవి ఏమంటున్నారంటే… మహిళలు అశ్లీల వీడియోలు చూడవద్దని పదేపదే విజప్తి చేస్తున్నారు. కోడంబాక్కంలోని ఓ మహిళా కళాశాలలో పోలీస్ యాప్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలు, పిల్లల మీద దాడులను అరికట్టడమే లక్ష్యంగా తాము తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేసినట్లు చెప్పారు. దాదాపు 7.30 కోట్ల మంది జనాభా గల తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటి వరకు పోలీసు యాప్ను పది లక్షల మంది మాత్రమే డౌన్లోడ్ చేసుకుని ఉన్నారని, వీరిలోనూ కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు పేర్కొన్నారు. మిగిలిన వారు ఎందుకు ఈ యాప్ మీద దృష్టి పెట్టడం లేదోనని ఆయన విచారం వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించే విధంగా రూపకల్పన చేసిన ఈ యాప్లో స్వల్ప మార్పులు చేయనున్నట్టు కూడా అదనపు డీజీపీ రవి వెల్లడించారు.
ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఓ కళాశాల కార్యక్రమంలో పోలీసు అధికారి ప్రసంగాన్ని ఇక్కడ వార్త రాయాలా? అని తిట్టుకోకండి. అక్కడే ఉంది అసలు విషయం. ఇంతకీ అదనపు డీజీపీ రవి కంఠశోషకు అసలు కారణం ఏమిటో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోక తప్పదు. పోర్న్ వీడియోలను వీక్షించేవారి సంఖ్య మన దేశంలోనే అధికంగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలిన విషయం తెలిసిందే కదా? వీటి వల్లనే మహిళలపై అనేక అఘాయిత్యాలు, అనర్థాలు కూడా జరుగుతున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఇదిగో ఈ నేపథ్యంలోనే మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించే ప్రక్రియలో భాగంగా తమిళనాడు పోలీసులు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే అశ్లీల వీడియోలను అదే పనిగా, గంటల కొద్ది వీక్షించే వారి భరతం పట్టే దిశగా చర్యలు ప్రారంభించారు. చిన్న పిల్లలను, మైనర్లను అశ్లీలంగా చిత్రీకరించి తీసిన వీడియోలే కాదు. అశ్లీల సైట్లలో గంటల కొద్ది గడిపే వారిని గుర్తించి, వారి భరతం పట్టే పనిలో పడ్డారు. తమిళనాడు పోలీసుల పరిశీలన, లేదా పరిశోధనలో తేలిన వాస్తవాలు ఈ వార్తా కథనానికి అసలు నాంది. తమిళనాడు రాష్ట్రంలో మూడు వేల మంది అదే పనిగా పోర్న్ వీడియోల్ని వీక్షిస్తూ, గంటల కొద్ది ఆన్లైన్లో గడుపుతున్నట్టు పోలీసుల నిఘాలో తేలింది. అంతేకాదు ఈ మొత్తం సంఖ్యలో కొందరు మహిళలు కూడా ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అశ్లీల వీడియోలను కన్నార్పకుండా చూస్తున్న మహిళలు చెన్నై నగరంలో ఉండడం గమనార్హం. ఈ విస్మయ అంశాన్ని అదనపు డీజీపీ రవి స్వయంగా పేర్కొనడం మరో విశేషం. ఇటీవలి కాలంలో అశ్లీల చిత్రాల్ని వీక్షించే వారి సంఖ్య పెరగడం విచారకరమని, ఇందులో మహిళలు కూడా ఉన్నారని, చెన్నైలో 30 మందిని గుర్తించామని ఆయన వివరించారు. ఇకపై దయచేసి అశ్లీల వీడియోలను వీక్షించొద్దు…ప్లీజ్… అని యువతులకు, మహిళలకు రవి ఈ సందర్భంగా విజప్తి కూడా చేశారు. అదీ సంగతి.