తెలంగాణా రాష్ట్రంలో సంక్రాంతి పర్వదినం తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే జనవరి మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. జనవరి నెలాఖరుకల్లా మొత్తం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లోని 3,149 వార్డుల విభజన ప్రక్రియను కూడా పూర్తి చేయడం గమనార్హం. అంతేగాక మున్సిపల్ పరిపాలన, యూడీ విభాగాలు విడివిడిగా 131 ఉత్తర్వులను జారీ చేశాయి. త్వరలోనే వార్డులవారీగా ఎలక్ట్రోరల్ రోల్స్, బీసీ ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. మొత్తంగా జనవరి తొలి వారంలో షెడ్యూల్, సంక్రాంతి తర్వాత ఎన్నికల నిర్వహణ ద్వారా వచ్చే నెలాఖరుకల్లా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఫిబ్రవరి నెలలో కొత్త పురపాలిక మండళ్లు కొలువు దీరనున్నాయి.