మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం శామీర్ పేటలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జమున మాట్లాడుతూ, తమకు చెందిన హేచరీస్, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టడం తమకు తెలుసని, తాము కష్టపడి పైకొచ్చామని, ఎవరినీ మోసం చేయలేదన్నారు. ఓ ప్రణాళిక ప్రకారం పోలీసులతో తమను భయభ్రాంతులకు గురిచేశారని జమున ఆరోపించారు. అదేవిధంగా మెదక్ జిల్లా మాసాయిపేటలో తాము 46 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, ఒక్క ఎకరం ఎక్కువగా ఉన్నా ముక్కు నేలకు రాస్తామని సవాల్ విసిరారు. భూ సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా? అని జమున ప్రశ్నించారు. తాము 1992లో దేవరయాంజల్ వచ్చి 1994లో భూములు కొన్నామని, మా గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. శ్రమించి జీవించడం తమకు తెలుసని, అసత్య ప్రచారాలు ఎన్నో రోజులు నిలబడవని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, ధర్మం నిలబడుతుందని జమున అన్నారు. ఆరోపణలు వచ్చిన భూముల్లో సర్వే చేయొద్దని తాము మేం చెప్పలేదని, అయితే తమ సమక్షంలో సర్వే చేయాలని కోరుతున్నామన్నారు.