తన సొంత డబ్బుతో ప్రభుత్వానికి అందించిన అంబులెన్సుల నిర్వహణపై ఖమ్మం ఎంపీ, పార్లమెంటులో టీఆర్ఎస్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపదలో గల పేదలను ఆదుకునేందుకు సొంత ఖర్చుతో ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తాను అందించిన అంబులెన్సుల నిర్వహణపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో అంబులెన్సుల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీ నామ శనివారం జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి ఆదేశించారు. పేద ప్రజలకు కష్టకాలంలో ఉపయోగపడాలనే సత్సంకల్పంతో ఎంపీ నామ ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అంబులెన్స్ లను వితరణ చేసిన సంగతి తెలిసిందే.
నామ ముత్తయ్య ట్రస్టు ద్వారా ఎంపీ నామ వీటిని అందించారు. అయితే వీటి నిర్వహణలో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు తన దృష్టికి రావడంతో ఎంపీ తక్షణమే స్పందించారు. ఖమ్మం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతికి ఫోన్ చేసి, పరిస్థితి గురించి ఆరా తీశారు. అంబులెన్సుల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తరాదని, అవి పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపకరించాలన్నారు. ఇందుకోసం అంబులెన్సులకు డబుల్ డ్రైవర్లను నియమించి, వాటిని నిత్యం పేదలకు అందుబాటులో ఉంచాలని డీఎం అండ్ హెచ్ఓను ఎంపీ ఆదేశించారు. అన్ని చోట్ల రెండు షిప్టులు ఉండే విధంగా డబుల్ డ్రైవర్లను నియమించాలనన్నారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి, నిత్యం ప్రజలకు అందు బాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటీవల ఖమ్మంలో కోవిడ్ పై జరిగిన సమీక్షా సమావేశంలో కూడా ఎంపీ నామ ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారులకు తగు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. లక్షలు ఖర్చు చేసి వితరణ చేసిన అంబులెన్సులు పేద ప్రజలకు ఉపయోగ పడాలని , పేదలు కరోనా కాలంలో అంబులెన్సులు దొరక్క ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి, వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆ పరిస్థితి నుంచి పేదలను ఆదుకోవాలనే మానవతా దృక్పథంతో అంబులెన్సులను ఏర్పాటు చేశామన్నారు.
దీనిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి స్పందిస్తూ, ఎంపీ నామ చొరవతో ఏర్పాటు చేసిన అంబులెన్సులన్నీ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరిస్తామన్నారు. డబుల్ డ్రైవర్లను ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ కు నివేదించామని, అతి త్వరలోనే ఈ సమస్య కూడా తీరుతుందని ఎంపీకి వివరించారు. కాగా మధిరలో శనివారం ఓ పత్రికా విలేకరి తండ్రికి ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్ సలహా మేరకు సత్వరమే ఎంపీ నామ ఏర్పాటు చేసిన అంబులెన్సులో అతన్ని ఖమ్మం తరలించారు.