‘నొప్పి తెల్వకుంట సూది ఎయ్యాలె…’ తెలంగాణాలో ఇది పాపులర్ సామెత. పేషెంటుకు చేసిన చికిత్స ఏమిటో తెలియకుండా బిల్లు వేయడం నేర్చుకోవలె… ఇదీ సరికొత్త సామెత. కరోనా మహమ్మారి అనేక ప్రాణాలను కబలిస్తున్న విషాద పరిణామాల్లో ప్రయివేట్ ఆసుపత్రుల దోపిడీపై ప్రభుత్వం కూడా కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయివేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న కరోనా పేషెంట్లకు ఇస్తున్న బిల్లులు చూసి పలువురు షాక్ కు గురవుతున్నారు. లక్షలాది రూపాయల బిల్లు వేయడం కరోనా చికిత్సలో సాధారణ ఆరోపణ. కానీ ఏ వివరాలు లేకుండా బిల్లులు వేయడం ఖమ్మంలోని కొన్ని ప్రయివేట్ ఆసుపత్రుల నిర్వాహకుల ప్రత్యేకత. ఇది అసలుదో, నకిలీదో తెలియదుగాని, ఖమ్మం ఆసుపత్రుల, డాక్టర్లకు చెందిన వాట్సప్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ బిల్లులో గమనించాల్సిన ఆసక్తికర అంశాలేమిటంటే… ఆసుపత్రి పేరు లేదు. డిపార్ట్మెంట్ పేరు మాత్రం ఇంటర్నల్ మెడిసిన్ (ట). ఈనెల 22న చేరిన పేషెంటు 27వ తేదీన డిశ్చార్జి అయ్యాడు. వివరాల కాలమ్ లో సర్వీస్ ఛార్జీలుగా పేర్కొంటూ క్వాంటిటీ 122గా ప్రస్తావించారు. అందుకు అక్షరాలా లక్షా 93 వేల 350 రూపాయలుగా పేర్కొన్నారు. ఫార్మసీ ఛార్జెస్ కింద 53 క్వాంటిటీగా ప్రస్తావిస్తూ 24 వేల 167 రూపాయలను వేసి కొట్టేశారు. మొత్తం బిల్లు రూ. 1,93,350గా పేర్కొంటూ అడ్వాన్సుగా 60,550 చెల్లించినట్లు, మిగతా రూ. 1,32,800 బాకీ ఉన్నట్లు వివరించారు. కంప్యూటర్ అక్షరాల్లో జనరేట్ చేసిన ఈ బిల్లుపై పేషెంట్ సంతకంగాని, ఆసుపత్రి నిర్వాహకుల సంతకాలుగాని లేకపోవడం గమనార్హం.
ఇది ఫైనల్ బిల్లుగా పేర్కొన్నప్పటికీ, చేసిన వైద్యమేంటి? ఆసుపత్రి పేరేమిటి? పేషెంట్ కు ఆక్సిజన్ పెట్టారా? లేదా? అనే ప్రశ్నలకు బిల్లులో ఎక్కడ సమాధానం లేదు. ఏదేని ప్యాకేజీ రూపంలో ఇటువంటి చికిత్స దందా కొనసాగుతోందా? అనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే దశలో బిల్లులో పేర్కొన్న డాక్టర్, యూజర్ పేర్లయినా ఒరిజినలేనా? కాదా? అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రయివేట్ ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, మరికొన్ని ఆసుపత్రుల కోవిడ్ లైసెన్సులు రద్దు చేస్తున్న ప్రభుత్వం ఈ తరహా బిల్లుల దందాపై ఎలా స్పందిస్తుందో మరి!
ఫొటో: ప్రతీకాత్మక చిత్రం