మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దానోర్ తాలూకాలోని అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 13 మంది నక్సలైట్లు మరణించారు. ఇందులో ఎనిమిది మంది నక్సలైట్ల మృతదేహాలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. సీ-60 భద్రతా దళాలు మావోయిస్టు నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ భారీ ఎన్కౌంటర్ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య ఇంకా ఎన్కౌంటర్ జరుగుతోందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్కౌంటర్ లో మరణించిన నక్సలైట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. తెలంగాణాలోని కాళేశ్వర్యం పుణ్యక్షేత్రానికి ఘటనా స్థలం దాదాపు 180 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.
‘షెల్టర్ జోన్’పై పోలీసుల మెరుపు దాడి?
కాగా మావోయిస్టు పార్టీ నక్సలైట్ల షెల్టర్ జోన్ గా భావిస్తున్న దానోర్ తాలూకా అటవీ ప్రాంతంపై పోలీసులు పట్టు సాధించడం గమనార్హం. దండకారణ్యంలో భాగంగానే పరిగణిస్తున్న దానోర్ అటవీ ప్రాంతాన్ని నక్సలైట్లు ఏటా వేసవిలో షెల్టర్ జోన్ గా వినియోగిస్తుంటారనే ప్రచారం ఉంది. గాలింపు చర్యల్లో భాగంగా దట్టమైన దానోర్ అటవీ ప్రాంతానికి వెళ్లిన సీ-60 భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడడం, ఇరువర్గాల మధ్య భీకర పోరాటం జరగడం, 13 మంది నక్సలైట్ల మరణించిన ఘటన పోలీసుల విజయంగా భావిస్తున్నారు. నక్సలైట్లకు పెట్టని కోటగా పేర్కొంటున్న దానోర్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.