తెలంగాణా రాష్ట్రంలో త్వరలో భూముల మార్కెట్ విలువ (ధర) పెంపునకు రంగం సిద్ధమవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భానంతరం తొలిసారి భూముల మార్కెట్ విలువను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2013 ఆగస్టులో భూముల విలువను పెంచడం గమనార్హం. తాజాగా సర్కారు పెద్దల ఆదేశం మేరకు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో తొలిసారిగా భూముల విలువ పెంచే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ నోట భూముల విలువ పెంపు ప్రస్తావన వచ్చింది. ఈమేరకు అధికారగణం ప్రతిపాదనలు కూడా పంపించింది. అయితే మరింత పకడ్బందీగా, మెరుగైన ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
దీంతో భూముల విలువ పెంపు కసరత్తు ప్రారంభమైంది. తాజా ప్రతిపాదనలతో సీఎం కేసీఆర్ కు నోట్ కూడా అందించినట్లు తెలిసింది. భూముల విలువ పెంపునకు సంబంధించి తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిసింది. కమిటీ సభ్యులుగా జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, సబ్ కలెక్టర్లు ఉంటారు. ఈ కమిటీల సిఫారసు మేరకు 25% భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ధరలను రెవెన్యూశాఖ నోటిఫై చేస్తుంది. ప్రభుత్వ, మార్కెట్ ధరల మధ్య తేడాతో కమర్షియల్, అర్బన్, రూరల్ భూముల ధరలు 10 నుంచి 100% వరకు పెరిగే అవకాశం ఉంది. భూముల ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీ కూడా పెరగనుంది. ఇదిలా ఉండగా భూముల ధరల పెంపుపై రియల్ ఎస్టేట్ వర్గాలతో ఇప్పటికే చర్చలు నిర్వహించినట్లు తెలిసింది. ఆకర్షణీయమైన స్టాంపు డ్యూటీ పథకాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉందంటున్నారు. మినిమం కట్ఆఫ్ వరకు 6%, ఆ తరవాత పెరిగే మొత్తం రిజిస్ట్రేషన్ చార్జీలపై 5% మాత్రమే స్టాంప్ డ్యూటీ విధించినున్నట్లు అధికారిక వర్గాల అంచనా. ప్రభుత్వ ప్రతిపాదనకు రియల్ వర్గాలు మద్ధతు తెలిపినట్లు కూడా తెలిసింది. తన వద్దకు వచ్చిన నోట్ ను సీఎం పరిశీలించాక, సుముఖత వ్యక్తం చేయగానే అధికారికంగా భూముల విలువను ప్రకటించే అవకాశం ఉంది.