ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా సిల్గేర్ కాల్పుల ఘటనపై బస్తర్ ప్రాంత మీడియా సంస్థ ఒకటి సంచలన కథనాన్ని ప్రచురించింది. తారెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్గేర్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంపును ఎత్తివేయాలని స్థానిక గిరిజనులు నిన్న పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ ప్రకటించారు. గిరిజనుల ఆందోళన సమూహంలో జీగురుగొండ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టు పార్టీ నక్సలైట్లు చొరబడి పోలీసులపైకి కాల్పులు జరిపారని, ఈ సందర్భంగా ఆత్మరక్షణ కోసం తమ జవాన్లు కాల్పులు జరిపారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఘటనలో ముగ్గురు మరణించారని, చనిపోయినవారు ఎవరనేది గుర్తించాల్సి ఉందని ఐజీ సుందర్ రాజ్ నిన్న వెల్లడించిన విషయం విదితమే. అయితే సిల్గేర్ కాల్పుల ఘటనపై స్థానిక మీడియా వర్గాల కథనం ఇందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. మొత్తం ఈ ఘటనలో 9 మంది గ్రామస్తులు మరణించారని, మరో 15-20 మంది వరకు గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక గ్రామస్తులు తెలిపారని బస్తర్ ప్రాంతానికి చెందిన ‘లల్లూరామ్.కామ్’ అనే వెబ్ మీడియా సంస్థ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
లల్లూరామ్.కామ్ అనే వెబ్ మీడియా కథనం ప్రకారం… ‘సిల్గేర్ క్యాంపుపై నక్సలైట్లు దాడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు నిన్న అర్థారాత్రి వరకు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసుల కాల్పుల్లో 9 మంది మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. కాల్పుల్లో 15-20 మంది గ్రామాస్తులు గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి నిర్ధారణ లేదు. పోలీసులకు ఇప్పటి వరకు మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.
వాస్తవానికి సిల్గేర్ లోని పోలీసు క్యాంపునకు నిరసనగా వేలాది మంది గ్రామస్తులు నిరసనకు దిగారు. ఈ ఘటన తర్వాత భద్రాత బలగాల, గ్రామస్తుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన ఘటనలో చాలా మంది గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. ‘లల్లూరామ్.కామ్’ ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా కలిగి ఉంది. ఇందులో వరుసగా 25-30 సార్లు కాల్పులు జరిపే శబ్దం ఉంది. ఇదే సమయంలో గ్రామస్తుల మధ్య తొక్కిసలాట కూడా జరిగింది.
తాము పోలీస్ క్యాంపును వ్యతిరేకిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. పోలీసులు లాఠాఛార్జి కూడా చేశారు. కాల్పుల ఘటనలో 9 మంది చనిపోయారు. తమతో నక్సలైట్లు లేరని గ్రామస్తులు చెప్పారు. దాదాపు అయిదు వేల మంది గ్రామస్తులు నిరసనలో పాల్గొన్నారు. పోలీస్ క్యాంపునకు వ్యతిరేకంగా వేలాది మంది గ్రామస్తులు రెండు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామస్తుల ముసుగులో నక్సలైట్లు పోలీస్ క్యాంపును వ్యతిరేకిస్తున్నారని బస్తర్ ఐజీ చెప్పారు. ఇక్కడ క్యాంపు ఏర్పాటును నక్సలైట్లు ఇష్టపడడం లేదని, ఆయా నిరసనల మధ్యే సోమవారం నక్సలట్లు దాడి చేశారని, ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పాయరని ఐజీ చెప్పారు.’’
ఇదీ ‘లల్లూరామ్.కామ్’ ప్రచురించిన వార్తా కథనపు సారాంశం. ఇందుకు సంబంధించి గ్రామస్తుల వాదన పేరుతో ఓ వీడియోను, అదేవిధంగా కాల్పులకు సంబంధించి మరో వీడియోను కూడా ఆయా మీడియా సంస్థ ‘లింక్’ చేసింది. ఆయా రెండు వీడియోలను దిగువన గల లింక్ ల ద్వారా చూడవచ్చు.