ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో పోలీస్ క్యాంపు ఏర్పాటును నిరసిస్తూ గిరిజనులు ఆందోళనకు దిగిన సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. అయితే చనిపోయినవారు గ్రామస్తులా? లేక నక్సలైట్లా? అనే అంశంపై స్పష్టత లేదు. కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. వివరాల్లోకి వెడితే… తారెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్గేర్ వద్ద పోలీసులు కొద్దిరోజుల క్రితం పోలీస్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని స్థానిక గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందులో భాగంగానే పోలీస్ క్యాంపును ఎత్తివేయాలని వందలాది మంది గిరిజనులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన గిరిజనులను నిలువరించేందుకు పోలీసులు దారి మధ్యలోనే ముళ్లకంచెను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గిరిజనుల నిరసన, పోలీసుల అడ్డగింత వంటి దృశ్యాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే జరిగిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు గాయపడినట్లు కూడా తెలుస్తోంది.
అయితే సిల్గేర్ ఘటన దురదృష్టకరమని బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గ్రామస్తుల మధ్య చొరబడి ముందు నక్సలైట్లే కాల్పులు జరిపారని ఆయన ఆరోపించారు. గ్రామస్తులను స్థానిక మావోయిస్టు కేడర్ రెచ్చగొట్టి బేస్ క్యాంపునకు వ్యతిరేకంగా పోరాడాలని మావోయిస్టులు ఒత్తిడి తెచ్చారన్నారు. దీంతో గతంలో జరిగిన ఘటనలతో గ్రామస్తులు మావో కేడర్ చర్యలకు బయపడి పోలీసులపై తిరుగుబాటు చేశారని అన్నారు. పోలీసుక్యాంపును ఎత్తివేయాలని వత్తిడి తీసుకొస్తున్నారని, సోమవారం భారీ సంఖ్యలో ఆదివాసీలు క్యాంపును చుట్టు ముట్టారని ఐజీ చెప్పారు. ఇదే అదునుగా భద్రతా బలగాలపై మావోయిస్టు పార్టీకి చెందిన జీగురుగుండా ఏరియా కమిటీ దాడికి తెగబడిందన్నారు. ఒకవైపు గ్రామస్తులు రోడ్డుపై భారీసంఖ్యలో చేరుకుని ఆందోళనలు చేస్తుంటే వారికి గత మూడురోజుల క్రితం నచ్చజెప్పామన్నారు. పోలీస్ క్యాంపు మీ రక్షణ కోసమేనని వారికిన నచ్చచెప్పినప్పటికీ గ్రామస్తులు మరోసారి సోమవారం ఆందోళనకు దిగారన్నారు. వారిని తమ పోలీసు బలగాలు నివారిస్తున్న క్రమంలోనే మరోవైపు గ్రామస్తుల సమూహంలో నక్సల్స్ చేరి పోలీసులపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. దీంతో మావోయిస్టులపై పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారని వివరించారు. చనిపోయినవారు స్థానిక మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులా లేక మరెవరనే విషయం నిర్థారించవలసి ఉందని ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. కాగా ఇప్పటికీ మావోయిస్టులు పోలీసు క్యాంపుపై దాడికి యత్నిస్తున్నారని, జవాన్లు మావోయిస్టుల దాడిని తిప్పి కొడుతున్నారని చెప్పారు.
పోలీస్ క్యాంపును ఎత్తివేయాలని గిరిజనులు ఆందోళనకు దిగిన దృశ్యాన్ని దిగువన గల వీడియోలో చూడవచ్చు.