ఓ పత్రిక వార్తా కథనంపై పినపాక తహశీల్దార్ సంచలన నివేదిక
తనను లక్ష్యంగా చేసుకుని ఓ తెలుగు దినపత్రిక రాసిన వార్తా కథనంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక తహశీల్దార్ కె. విక్రమ్ కుమార్ సంచలన నివేదికను సమర్పించారు. ఆయా పత్రిక రాసిన వార్తా కథనం బూటకమని, అందుకు దారి తీసిన పరిస్థితులను, పరిణామాలను కూలంకషంగా వివరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కు శుక్రవారం సమర్పించిన నివేదిక (Rc No. B/235/2021) ద్వారా వివరించారు.
తహశీల్దార్ కె. విక్రమ్ కుమార్ కలెక్టర్ కు సమర్పించిన నివేదిక ప్రకారం…. గిరిజనేతరులైన కొందరు బడా రియల్టర్లు, ఓ సామాజికవర్గానికి చెందిన గిరిజనేతరులు కలిసి మణుగూరు-ఏడూళ్ల బయ్యారం ప్రధాన మార్గంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. ఉప్పాక రెవెన్యూ గ్రామానికి చెందిన సర్వే నెం. 987లో గల 2.10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బయ్యారం క్రాస్ రోడ్ సమీపాన మణుగూరు-ఏటూరునాగారం జాతీయ రహదారి నెం. 163 వద్ద గల ఈ భూమి భద్రాద్రి పవర్ స్టేషన్ కు సమీపాన ఉంది. ఎమ్మార్వోతోపాటు మండల గిర్దావర్-1, సర్వేయర్, వీఆర్ఏ లు ఆయా స్థలాన్ని ఈనెల 11వ తేదీన సందర్శించి తనిఖీ చేశారు. ఓ బడా రియల్టర్ (పేరు కూడా ఎమ్మార్వో ప్రస్తావించారు.) ఆయా ప్రభుత్వ స్థలంలో జీఐ షీట్లతో మూడు తాత్కాలిక షెడ్లను నిర్మిస్తున్నట్లు తనిఖీలో తేలింది.
ఈ నేపథ్యంలో రెవెన్యూ చట్టం ప్రకారం ప్రభుత్వ స్థలాలను పరిరక్షిస్తూ తాత్కాలికంగా నిర్మించిన మూడు షెడ్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఉప్పాక రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం. 987లో గల స్థలం ప్రభుత్వానికి చెందినదిగా స్పష్టం చేస్తూ, దురాక్రమణకు పాల్పడినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ బోర్డులు పాతారు. ఈ అంశానికి సంబంధించి ఈనెల 11వ తేదీన (Rc No. B/234/2021) ద్వారా నివేదికను కూడా సమర్పించారు. ఈ ఘటనకు ముందు కూడా ఇదే స్థలానికి ఎదురుగా గల సర్వే నెం. 683లోని బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద గల 1.24 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా రియల్టర్లు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ స్థలాన్ని పినపాక తహశీల్దార్ గా పనిచేసిన అనుదీప్ దురిశెట్టి అనే ట్రెయినీ ఐఏఎస్ అధికారి (Rc No. B/883/2019) ద్వారా పరిరక్షించారు. ఇది కూడా విలువైన ప్రభుత్వ భూమిగా గుర్తించారు.
ఇదే తరహాలో మరికొన్ని విలువైన ప్రభుత్వ స్థలాలను స్థానిక రియల్టర్లు, గిరిజనేతరులు కలిసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేగాక ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ చెల్లించకుడా, నియమ, నిబంధనలకు విరుద్ధంగా స్థానికొడకరు (పేరు ఉటంకించారు) పదేళ్లుగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ‘మన ఇసుక-మన వాహనం’పేరుతో ఇసుక రవాణాను పారదర్శకంగా నిర్వహిస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందిస్తూ అక్రమ రవాణాదారులకు ఎమ్మార్వో జరిమానా విధిస్తున్నారు.
ఆయా ఘటనల నేపథ్యంలో విలువైన ప్రభుత్వ స్థలాల కబ్జాలకు పాల్పడుతున్న బడా రియల్టర్ ఒకరు, పదేళ్లుగా ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్న మరో వ్యక్తి తదితరులు తనపై ఓ పత్రికలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఎమ్మార్వో విక్రమ్ కుమార్ కలెక్టర్ కు పంపిన నివేదికలో పేర్కొన్నారు. అంతేగాక తనను రాజీ పడాల్సిందిగా కబ్జాదారులు, ఇసుక అక్రమ రవాణాదారులు ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారని, ఈ విషయంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ ఒకరు కూడా రాజీ కోసం ప్రయత్నించారని ఆయన వివరించారు. ప్రభుత్వ స్థలాల పరిరరక్షణకు పాటుపడుతున్న తనకు ఈ విషయంలో సపోర్టును ఆశిస్తున్నట్లు విక్రమ్ కుమార్ కలెక్టర్ ను అభ్యర్థిస్తూ నివేదించారు.
ఫొటో: కబ్జా చేసిన స్థలంలో అక్రమ నిర్మాణాలను ఎమ్మార్వో విక్రమ్ కుమార్ కూల్చివేయించినప్పటి చిత్రం