రాష్ట్ర సరిహద్దుల్లో ఇరుగు, పొరుగు రాష్ట్రాల కరోనా రోగులతో వస్తున్న అంబులెన్సులను అడ్డుకోవడంపై తెలంగాణా హైకోర్టు నిన్న తీవ్రంగా ఆక్షేపించిన సంగతి తెలిసిందే. అంబులెన్సులను ఎందుకు ఆపారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అంతే కాదు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా వ్యవహరించలేదని, జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వ ఆస్తులు. వాటిపైకి వెళ్లే ముందు కేంద్రం నుంచి మీరు అనుమతి తీసుకునే వెళ్లారా? అని కూడా ప్రశ్నించింది,. ‘రోగుల ప్రాణాలు అక్కడే గాలిలో కలిసిపోవాలా? ఇవేం ఉత్తర్వులు? మీ చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. ఈ జీవో ముమ్మాటికీ కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఈ ఉత్తర్వులు జారీచేసిన అధికారి కోర్టు ధిక్కార చర్యలను ఆహ్వానించినట్లే’ అని వ్యాఖ్యానించింది. అధికారుల చర్య కోర్టు ధిక్కారమేనని వ్యాఖ్యానిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసింది.
రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్సుల నిలువరింత, ఆంక్షలు తదితర అంశాలపై నిన్నటి పరిణామాల నేపథ్యంలోనే అధికార పార్టీ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో వింత వాదనతో పోస్టులు వెల్లువలా వచ్చిపడ్డాయి. తమకే బెడ్లు సరిపోవడం లేదని, ఇరుగు, పొరుగు రాష్ట్రాలవాళ్లు వస్తే తమ ప్రాణాలు గాల్లో కలిసిపోవాలా? వంటి అనేక ప్రశ్నలతో ఈ తరహా పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సరే ఈ విషయంలో ప్రభుత్వ చర్య, ఆ తదుపరి పరిణామాలపై అధికార పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లో ఆత్మరక్షణ పోస్టులు అనివార్యమయ్యాయనే వాదన కూడా ఈ సందర్భంగా లేకపోలేదు. కానీ మీడియా ఇటువంటి అంశాల్లో బాధ్యతాయుతంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదా? కానీ ఓ ప్రముఖ తెలుగు పత్రిక ఇందుకు విరుద్ధమైన వార్తా కథనాన్ని ప్రచురించడమే చర్చనీయాంశంగా మారింది. ఆ పత్రిక ఏమంటున్నదంటే….
‘‘వారం రోజులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులను హైదరాబాద్ వెళ్లకుండా సరిహద్దుల్లోనే ఆపేస్తుండటంతో వారంతా అనూహ్యంగా ఖమ్మంలోని కరోనా అనుమతి పొందిన బడా ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పొరుగునున్న జిల్లాల నుంచి వందల మంది కొవిడ్ బాధితులు ఖమ్మంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దీంతో పొరుగువారితోనే 40 శాతం పడకలు నిండిపోయాయని తెలుస్తోంది. దీంతో ఉమ్మడిజిల్లాకు చెందిన చాలామంది బాధితులకు సమయానికి బెడ్లు, మెరుగైన వైద్యం అందడం లేదన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కరోనా వైద్యానికి అనుమతి పొందిన ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 40 శాతం పడకలను ఇతర రాష్ట్రాల వారే ఆక్రమించారని, వారిలో ఎక్కువ మంది ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వారే ఉంటున్నారని తెలుస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు అంబులెన్స్లకు అనుమతివ్వకపోవటంతో వారంతా ఖమ్మం వైపు వస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ వారిని కాపాడుకునేందకు బంధువులు, ఖమ్మంలో తమకున్న పరిచయాలను ఉపయోగించడంతో పాటు ఎంత ఖర్చుకైనా వెనకాడకపోతుండటంతో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా వారిని చేర్చు కునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయని తెలుస్తోంది. ఇలా ప్రాంతాలతో సంబంధం లేకుండా కరోనా బాధితుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని లెక్కలోకి తీసుకుని, వారు చెల్లించే అడ్వాన్స్ ఆధారంగా వైద్యసేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతాల రోగులు ప్రాణాపాయ స్థితిలో ఉండి ప్రాణాలు కాపాడుకోవాలన్న తపనతో ఎంత డబ్బులు చెల్లించటానికైనా వెనకడగు వేయటం లేదు. దీంతో వారిని చేర్చుకునేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజ మాన్యాలు ఆసక్తి చూపుతుండటంతో స్థానికంగా ఎంతో మంది బాధితులు పడకలు దక్కక, మెరుగైన వైద్యానికి నోచుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో పొరుగు వారి లెక్కల ను బయటకు రానివ్వడం లేదని, జిల్లా పరిపాలన అధికారులు ప్రైవేట్ హాస్పటల్స్లోని ఆ లెక్కలు తీసేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రం వైద్యహబ్గా పేరొందడం, ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొన్ని కరోనా వైద్యసేవల్లో మెరుగ్గా ఉన్నాయని, రికవరీ శాతం అధికంగా ఉందన్న సమాచారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సరిహద్దులోని మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి ఇప్పటికే వందల సంఖ్యలో కరోనా బాధితులు ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. ఇలా ఇతర జిల్లాలనుంచి వచ్చిన వారితో 20 శాతం నిండిపోగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులతో మరో 20 శాతం పడకలు నిండాయి.’’
ఇదీ ఆ పత్రిక వండివార్చిన కథనంలోని కొంత భాగం. మొత్తం 40 శాతం ‘పొరుగు’ రోగులతోనే ఆస్పత్రులు నిండిపోయాయని, ఇందులో ఇరవై శాతం ఇతర రాష్ట్రాలవారీగా, మరో ఇరవై శాతం ఇరుగు, పొరుగున గల వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ వంటి జిల్లాలకు చెందినవారుగా ఆయా పత్రిక తన కథనంలో పేర్కొంది. అయితే ఇందుకు గల ప్రామాణికమేంటి? 40 శాతం ‘పొరుగు’ రాష్ట్రాల రోగులు ఉన్నట్లు ఎవరు తేల్చారు? అనే అంశాలను మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. అంతేకాదు తెలంగాణాలోని కొన్ని జిల్లాలవారిని కూడా పొరుగు రోగులుగానే అభివర్ణించడం విశేషం. పొరుగు రోగుల కారణంగా స్థానిక బాధితులకు బెడ్లు దొరకడం లేదని, మెరుగైన వైద్యానికి నోచుకోవడం లేదని కూడా ఆయా పత్రిక ఆవేదన వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన అంబులెన్సులను అడ్డుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ‘ప్రాణం’ అంశంలోనూ ‘ప్రాంతీయ’ కోణాన్ని ఆవిష్కరిస్తూ ప్రముఖ తెలుగు పత్రిక ఒకటి వార్తా కథనాన్ని వండి వార్చడంపై సహజంగానే ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ తరహా వార్తా కథనాలు రోగుల్లో ‘ప్రాంతీయ’ విద్వేషానికి కారణమైతే అందుకు బాధ్యులెవరన్నది కూడా ఓ ప్రశ్నే.