తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందులు సామాగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని రాష్ట్రానికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ వివిధ రాష్ట్రాలతో బుధవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు వీడియో కాన్పరెన్స్ లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని, కట్టడికోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలను కేంద్ర మంత్రి అడిగితెలుసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులను నియంత్రిత చర్యలను మంత్రి హరీష్ రావు వివరించారు. రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు, ఆక్సిజన్ తదితరాల కోటాను మరింతగా పెంచి సత్వరమే రాష్ట్రానికి సరఫరా అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు.