గంజాయి దందాలో ఇదో కొత్త కోణం. స్మగ్లర్లు గంజాయి రవాణాకు ఎంచుకున్న సరికొత్త మార్గాన్ని చూసి పోలీసులు నివ్వెరపోయారు. గంజాయి రవాణాకు ఇప్పటి వరకు కార్లను, ఇతర వాహనాలను మాత్రమే వినియోగించే అక్రమార్కులు సరికొత్తగా క్రేన్లను వినియోగిస్తుండడం విశేషం. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు ఎవరికీ అనుమానం రాకుండా క్రేన్ వెనుక గల బాక్సులో గంజాయిని రవాణా చేస్తుండగా కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. కీసర చెక్ పోస్ట్ వద్దకు వచ్చిన క్రేన్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని తనిఖీ చేయగా అందులో 150 బాక్సుల గంజాయి పట్టుబడింది. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.