ఆంధప్రదేశ్ కు చెందిన కరోనా బాధితులను తెలంగాణా సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకుంటున్నట్లు తాజా సమాచారం. కరోనా బారిన పడిన వారిని వైద్యం కోసం తెలంగాణాకు తీసుకువస్తున్న అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దుల్లోనే పోలీసులు నిలువరిస్తున్నారు. ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను తనిఖీ చేసి అందులో కరోనా రోగులు ఉన్నట్లయితే వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఏపీ నుంచి వచ్చే కరోనా వ్యాధిగ్రస్తులను తిరిగి వెనక్కి పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ విషయంపై పోలీసు వర్గాలు స్పష్టతనిచ్చాయి. చికిత్స కోసం వస్తున్న ఏపీకి చెందిన కరోనా బాధితులకు తెలంగాణాలోని ఆసుపత్రుల్లో అప్పాయింట్ మెంట్ ఉంటేనే అనుమతిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎటువంటి అనుమతి, అప్పాయింట్ మెంట్ లేకుండా రోగులు రావడాన్ని నిలువరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణా ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు బెడ్లు నిండుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పోలీసులు స్పష్టం చేశారు.