ఈ ఫొటోను నిశితంగా పరిశీలించండి. అనారోగ్యంతో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్ర నేత రామన్న మృతదేహం వద్ద విలపిస్తున్న ఆ ఇద్దరు ఎవరు? ఇదీ ఛత్తీస్ గఢ్ పోలీసులతోపాటు ఆ రాష్ట్ర సరిహద్దుల్లో గల తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ జిల్లాలకు చెందిన పోలీసులను వేధిస్తున్న ప్రశ్న. రామన్న అంత్యక్రియలకు సంబంధించి మావోయిస్టు పార్టీ సోమవారం రాత్రి విడుదల చేసిన అనేక ఫొటోల్లో ఈ చిత్రం కూడా ఉంది. రామన్న మృత దేహానికి ఓ వైపున ప్లాస్టిక్ కుర్చీలో అలీవ్ గ్రీన్ దుస్తుల్లో ఓ మహిళ, మరో వైపున అదే దుస్తుల్లో కళ్లద్దాలు ధరించిన యువకుడు ఒకరు రోదిస్తున్న దృశ్యమిది. ఈ ఇద్దరు ఎవరనే అంశంపై పోలీసు నిఘా వర్గాలు ప్రస్తుతం ఆరా తీస్తున్నాయి.
రామన్న భార్య సావిత్రి భద్రాచలం సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా కిష్టారం ఏరియా మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదే విధంగా రామన్నకు ఓ కుమారుడు కూడా ఉన్నారని, ప్రస్తుతం అతను కూడా పార్టీలోనే ఉన్నాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రామన్న మృతదేహం వద్ద విలపిస్తున్న అలీవ్ గ్రీన్ దుస్తుల్లో గల ఆ ఇద్దరు బహుషా రామన్నభార్య సావిత్రి, కుమారుడే కావచ్చని కూడా పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా రామన్న మరణ వార్త ధృవపడడం, అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలు కూడా పార్టీ స్వయంగా విడుదల చేసిన నేపథ్యంలో ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, తెలంగాణా పోలీసులు అప్రమత్తమై, తాజా సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే రామన్నఅంత్యక్రియలకు హాజరైన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నేతలు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఛత్తీస్ గఢ్, తెలంగాణా సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.