మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎపిసోడ్ లో ఇదో ఆసక్తికర పరిణామం. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటెల రాజేందర్ తో నిన్న భేటీ అయిన పరిణామాల్లోనే ఈ ఘటన జరగడం విశేషం. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటెల రాజేందర్ ను కలిసిన ఉదంతం రాజకీయ చర్చకు తావు కల్పించింది. గురువారం రాత్రి ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెల రాజేందర్ ను కలిశారు. ఆర్థిక మంత్రి హరీష్ రావుకు సహచరునిగా ప్రాచుర్యం పొందిన ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెలను కలవడం సహజంగానే రాజకీయ చర్చకు ఆస్కారం కలిగించింది.
నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి 2014లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన పదిహేనేళ్ల ఎమ్మెల్యే పదవీ కాలంలో మంత్రి హరీష్ రావు వెన్నంటే రవీందర్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ చేతిలో రవీందర్ రెడ్డి పరాజయం పాలయ్యరు. తదనంతర రాజకీయ పరిణామాల్లో సురేందర్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయినప్పటికీ హరీష్ రావుతో గల అనుబంధాన్ని మాత్రం రవీందర్ రెడ్డి ఏమాత్రం వీడకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రవీందర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్ ల మధ్య ఆధిపత్య పోరు సాగుతోందనే ప్రచారం ఉండనే ఉంది.
దీంతో ఉత్తర తెలంగాణాలోని టీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఒకరిగా పేరుగాంచిన ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెల రాజేందర్ ను కలవడం అధికార పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలకు తావు కల్పించింది. మంత్రి పదవి నుంచి ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డి వంటి స్థాయి నేతలెవరూ ఆయనను కలిసిన దాఖలాలు లేవు. ఇది సరికొత్త రాజకీయ సమీకరణలకు దారి తీస్తుందా? అనే సందేహాన్ని కలిగిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.