కాకతాళీయమో, యాదృచ్చికమోగాని గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థల మేయర్ అభ్యర్థులుగా ఎంపికైన ఇద్దరు మహిళా నేతలు పూర్వ కాలంలో తెలుగుదేశం పార్టీకి చెందినవారే కావడం విశేషం. ఖమ్మం నగర పాలక సంస్థ తొలి మేయర్ గా ఎన్నిక కానున్న పునుకొల్లు నీరజ కార్పొరేటర్ గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన పునుకొల్లు నీరజ కుటుంబం వాస్తవానికి ఆంధప్రదేశ్ నుంచి వ్యాపారం కోసం ఖమ్మం వచ్చింది. గుడివాడ మండలం పెదపారుపూడికి చెందినట్లుగా తెలుస్తున్న వ్యాపారి పునుకొల్లు రామబ్రహ్మం నీరజ భర్త. ఓ పురుగు మందుల కంపెనీ డీలర్ షిప్ ద్వారా రామబ్రహ్మం కుటుంబం ఖమ్మం వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. తొలుత తెలుగుదేశం పార్టీలో గల రామబ్రహ్మం కుటుంబం ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. గత, ప్రస్తుత ఎన్నికల్లో నీరజ టీఆర్ఎస్ కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఖమ్మం నగర తొలి మేయర్ పదవి కోసం కమ్మ సామాజిక వర్గానికే చెందిన పలువురు మహిళా కార్పొరేటర్లు ఆశించినప్పటికీ, నీరజ అభ్యర్థిత్వం వైపే పార్టీ మొగ్గు చూపడం గమనార్హం.
అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మేయర్ అభ్యర్థిగా ఎంపికైన గుండు సుధారాణి రెండు దశాబ్దాల క్రితం వసుంధర బ్యాంకు చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. వరంగల్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మేయర్ కోసం గతంలో కార్పొరేటర్ గా పోటీచేసి గెలిచినప్పటికీ టీడీపీ ప్రతిపక్షంలో మిగలడంతో ఫ్లోర్ లీడర్ గా పని చేశారు. ఈ కాలపరిమితి ముగిసే సమయంలోనే ఆమెను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఎంపీగా ఉంటూనే 2014 సాధారణ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఉమెన్ ఫైనాన్స్ సంస్థ చైర్మన్ గా, టీఆరెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే డివిజన్ నుంచి ఆమె కోడలు గుండు ఆశ్రితారెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పుడు సుధారాణి మేయర్ లక్ష్యంగానే పోటీచేసి గెలుపొందడం విశేషం.