రెమ్ డెసివర్ ఇంజక్షన్లతో బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడతున్న ముఠాను వరంగల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కరోనా వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయాల్లో డాక్టర్లు అందించే రెమ్ డెసివర్ ఇంజక్షన్ల గరిష్ట ధరకన్నా అత్యధిక రేట్లతో అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుల నుంచి 28 రెమ్ డెసివర్ ఇంజక్షన్లు, 20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫార్మసీ అసిస్టెంట్ బాగాజీ మనోహర్, ఫార్మసిస్ట్ కొలిపాక కుమారస్వామి, ఫార్మసీ వర్కర్ ఐత అశోక్ ఉన్నారు.
ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ… ప్రస్తుతం కరోనా వ్యాధి తీవ్రత అధికంగా వుండటంతో పాటు, అత్యధిక వ్యాధిగ్రస్తులు వ్యాధి నివారణకు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఇదే సమయంలో కరోనా వ్యాధి చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయంలో అందించే రెమ్ డెసివర్ ఇంజక్షన్లు వినియోగం అధికకావడంతో పాటు ప్రస్తుతం మార్కెట్ అందుబాటులో లేకపోవడంతో ఇదే అదునుగా భావించి స్థానికంగా వుండే ఆసుపత్రుల్లోని మందులషాపులో పనిచేస్తూ రెమ్ డెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరలకు ఇంజక్షన్లను అమ్మి సొమ్ము చేసుకోనేందుకు సిద్ధపడ్డారని చెప్పారు. ఇందులో భాగంగా నగరంలోని ఓ ప్రైవేట్ హస్పటల్ లో మందుల దుకాణాన్ని నిర్వహిస్తున్న ఈ ముఠా సభ్యులు హెటీరో ఫార్మా కంపెనీ నుండి రెమ్ డెసివర్ ఇంజక్షన్లను ఒక్కొక్కటి 2,800/-రూపాయల చొప్పున కొనుగోలు చేసి వ్యాధిగ్రస్తులకు 3,490/- అమ్మాల్సి వుంటుందన్నారు. అయితే ప్రస్తుతం ఈ రెమ్ డెసివర్ ఇంజక్షన్లు మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో సంబంధిత హస్పటల్ ఫార్మసీ యాజమాన్యం, సిబ్బంది కరోనా వ్యాధి గ్రస్తులకు రూ. 35 వేల నుండి 45వేల రూపాయలకు బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవడం జరుగుతోందన్నారు.
ఈ బ్లాక్ దందాపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు సంబంధిత హాస్పిటల్ మందుల దుకాణంపై దాడులు నిర్వహించి వారి వద్ద నుండి 28 రెమ్ డెసివర్ ఇంజక్షన్లతో పాటు 20వేల నగదును స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ బ్లాక్ దందా ముఠాను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా, హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, టాస్క్ఫో ర్స్ ఏసీపీ ప్రతాప్ కుమార్, ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ, సుబేదారి ఇన్ స్పెక్టర్ రాఘవేందర్, సుబేదారి సబ్-ఇన్స్ స్పెక్టర్ సాంబమూర్తి,
టాస్క్ ఫోర్స్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.