తెలంగాణా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు కలిగిస్తున్నాయి. తెలంగాణాలో అనూహ్య రాజకీయ మార్పునకు ఈ పరిణామాలు దారి తీయవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాల నిగ్గు తేల్చాల్సిందిగా ముఖ్యమంత్రి నిర్దేశించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో అసైన్డ్ భూముల వ్యవహారంలో మంత్రిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జిల్లా కలెక్టర్ ద్వారా సమగ్ర నివేదిక తెప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. మరోవైపు కబ్జా ఆరోపణలపై దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలని విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్ రావును కూడా సీఎం ఆదేశించారు.