‘ఆరోగ్య మంత్రికి కబ్జా రోగం’…. తెలంగాణాలో అధికార పార్టీ ఛానల్ గా ప్రాచుర్యం పొందిన టీ న్యూస్ లో కొద్దిసేపటి నుంచి ప్రసారమవుతున్న వార్త కథనపు శీర్షిక ఇది. మంత్రి ఈటెల రాజేందర్ వందల కోట్ల విలువైన భూములపై కన్నేశారని, బడుగు, బలహీనవర్గాలే బాధితులని, ఈ భూములను రెగ్యులరైజ్ చేయాలని అధికారులపై మంత్రి వత్తిడి చేశారనేది వార్తా కథనపు సారాంశం. తమపై మంత్రి ఈటెల ఒత్తిడి తీసుకువచ్చిన మాట వాస్తవమేనని గతంలో మెదక్ జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన అధికారుల ‘వాయిస్’ ను కూడా కథనానికి జోడించడం గమనార్హం. మెదక్ జిల్లా మాసాయిపేటలోని తన కోళ్ల ఫారల కోసం మంత్రి అసైన్డ్ భూముల కబ్జాకు ప్రయత్నించారని కూడా వార్తా కథనంలోని ముఖ్యాంశం. జమునా హేచరీస్ కోసం మంత్రి ఈటెల తమ భూములపై కన్నేశారని కొందరు రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తా కథనంలో ఉటంకించారు. ఈ సంచలనాత్మక కథనం కేవలం టీ న్యూస్ లోనే కాదు మరికొన్ని న్యూస్ ఛానళ్లలోనూ ప్రస్తుతం ప్రసారమవుతోంది. ఏ న్యూస్ ఛానల్ లో ఇటువంటి వార్తా కథనం ప్రసారమైనప్పటికీ విషయంపై చర్చ వేరే రకంగా ఉండేది కాబోలు. కానీ అధికార పార్టీ అనుబంధ ఛానళ్లుగా పేరుగాంచిన టీవీల్లోనే ‘బ్రేకింగ్’ కథనాలు ప్రసారమవుతుండడమే గమనించాల్సిన అసలు విశేషం.
వివిధ టీవీల్లో మంత్రి ఈటెలపై ప్రసారమవుతున్న వార్తా కథనాల్లోని నిజానిజాల సంగతి నిగ్గు తేలాల్సి ఉంది. సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారని, సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశముందని కూడా మరికొన్ని న్యూస్ ఛానళ్లు నివేదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ పదవిపై సహజమైన ఊహాగానాలే ప్రచారంలోకి వస్తున్నాయి. అధికార పార్టీ అనుబంధ సంస్థలుగా పేరుగాంచిన మీడియాలోనే ఈటెలను లక్ష్యంగా చేసుకుని వార్తలు వస్తుండడంతో ఆయన పదవికి గండం ఏర్పడినట్లుగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాము కిరాయిదార్లం కాదని, గులాబీ జెండా ఓనర్లమని దాదాపు ఏడాదిన్నర క్రితమే ఈటెల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా ఈటెల ఇటీవలి కాలంలోనూ అనేక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వంటి అంశాల్లో ప్రభుత్వ విధానాన్ని ఇరుకునపెట్టే విధంగా ఆయన చేసిన కామెంట్లు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈటెల రాజేందర్ కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తారనే ప్రచారం కూడా వాడుకలో ఉంది. ఈ పరిణామాల్లోనే ఈటెల రాజేందర్ భూకబ్జాకు పాల్పడ్డారని, పేదల అసైన్డ్ భూములపై కన్నేశారని కొద్ది సేపటి నుంచి అధికార పార్టీ అనుబంధ మీడియా సంస్థల్లో వార్తా కథనాలు వరుసగా ప్రసారమవుతుండడం విశేషం.
ఈ పరిణామాలు రాజకీయ ప్రాధాన్యతతో కూడుకున్నవిగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ఈటెల రాజేందర్ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురవుతారా? లేక సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకుంటారా? మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశిస్తారా? ఇవీ తాజా ప్రశ్నలు. మొత్తంగా తెలంగాణా రాజకీయాల్లో ఈ అంశం ఇప్పుడు ప్రకంపనలు కలిగిస్తోంది. ఏం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే.