ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మాతృభూమిని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు దృఢ సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ధరిత్రీ రక్షణ కోసం పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తున్న ‘‘తెలంగాణకు హరితహారం’’ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలందరూ ప్రకృతి వనరుల పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని కోరారు. మనతోపాటు ఈ ధరిత్రిపై జీవిస్తున్న పశు పక్ష్యాదులు, మొక్కలు, జంతుజాలం పట్ల సామరస్యంగా మసలుకోవడం మనందరి బాధ్యత అన్నారు. వాతావరణ మార్పుల వల్ల ధరిత్రికి పొంచిఉన్న ప్రమాదాలపై అవగాహన పెంచుకొని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు మనవంతు బాధ్యతగా వీలైనన్ని మొక్కలు నాటి, వాటిని పరిరక్షించాలని, తద్వారా ధరిత్రిని కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు