ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో డ్రోన్ల ద్వారా బాంబు దాడులు జరిగాయనే అంశంపై మావోయిస్టు పార్టీ సవాల్ చేసింది. ప్రభుత్వం చేసిన డ్రోన్ దాడులను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఆధారం లేని ఆరోపణలంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆ పార్టీ దక్షిణ సబ్ జోనల్ బ్యూరో పేరుతో పత్రికా ప్రకటన వెలువడింది. కేంద్ర హో మంత్రి అమిత్ షా, ప్రధాని సలహాదారు కె. విజయకుమార్, ఆపరేషన్స్ డీజీపీ అశోక్ జునేజా, ఆపరేషన్స్ ఐజీ నళిన్ ప్రభాత్ ల గైడెన్స్ లో ఎన్ఐఏ చేసిన దాడిగా మావోయిస్టు పార్టీ ఆరోపించింది. డ్రోన్ దాడి జరిగిన ప్రాంతానికి విలేకర్లు, ప్రజాస్వామికవాదులు వచ్చి పరిశీలించాలని కోరింది. ఈనెల 19న తమ పీఎల్జీఏ పడగొట్టిన రెండు డ్రోన్లను కూడా చూడవచ్చని పేర్కొంటూ ఫొటోను కూడా విడుదల చేసింది. డ్రోన్ దాడి జరిగిన ప్రాంతానికి మధ్యవర్తులను పంపిస్తే అసలు వాస్తవం తెలుస్తుందని మావోయిస్టు పార్టీ కోరింది.
ఫొటో: పీఎల్జీఏ పడగొట్టిన డ్రోన్ గా పేర్కొంటూ మావోయిస్టు పార్టీ విడుదల చేసిన చిత్రం