తమను లక్ష్యంగా చేసుకుని పోలీసులు డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేశారని మావోయిస్టు పార్టీ అగ్ర నేత వికల్ప్ చేసిన ఆరోపణలపై బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ స్పందించారు. ఈమేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టుల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఆ పార్టీ నక్సలైట్లలో నెలకొన్న గందరగోళ స్థితి ఫలితమని ఐజీ అభివర్ణించారు. బస్తర్ లోని పోలీసు భద్రతా బలగాలు స్థానిక ప్రజల ప్రాణాలను, ఆస్తులను పరిరక్షించాలనే లక్ష్యంతో చట్టపరిధిలో మాత్రమే పని చేస్తారని చెప్పారు.
మావోయిస్టు నక్సలైట్లు మందుపాతరలు పేల్చి వేలాది మంది అమాయక పౌరుల ప్రాణాలను తీశారని, ఇటువంటి పేలుడు పదార్థాలను ఉపయోగించడం ద్వారా నక్సలైట్లు పిల్లలను, మహిళలను, చివరికి జంతువులను కూడా వదలిపెట్టలేదన్నారు. ఈ రోజు కూడా నారాయణ్ పూర్ జిల్లాలో ఓ ఐటీబీటీ అధికారి నక్సలైట్ల మందుపాతర కారణంగా గాయడ్డారని, మరో ఆవు చనిపోయిందని ఐజీ సుందర్ రాజ్ చెప్పారు.
మహిళలు సహా వేలాది మంది అమాయక ప్రజలను చంపుతున్న మావోయిస్టులకు భద్రతా దళాలపై ఇటువంటి ఆరోపణలు చేసేందుకు నైతిక హక్కు లేదన్నారు. బస్తర్ ప్రాంత అమాయక గిరిజనులపై క్రూరత్వాన్ని ప్రదర్శించకుండా మావోయిస్టులు తమకు తాము నిగ్రహించుకుని, శాంతియుత జీవనాన్ని గడిపించేందుకు స్థానికులను అనుమతించాల్సిన సమయం అసన్నమైందని అన్నారు.