మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో కొద్దిసేపటి క్రితం ఓ సంచలన పత్రికా ప్రకటన వెలువడింది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు తమను లక్ష్యంగా చేసుకుని గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపించారనేది వికల్ప్ చేసిన తీవ్ర ఆరోపణ. ఇందుకు పోలీసులు డ్రోన్లను వినియోగించారని చెబుతూ, పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొత్సలంక, పాలగూడెం గ్రామాల్లో ఈ ఘటనలు జరిగాయన్నారు. ఈనెల 19వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు డ్రోన్ల ద్వారా డజన్ వరకు బాంబులు వేశారని వికల్ప్ ఆరోపించారు. అయితే ఈ డ్రోన్ల దాడికి ముందే తమ సహచరులు స్థలాన్ని మార్చడం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా రెండు ఫొటోలను కూడా నక్సల్ నేత వికల్ప్ జత చేయడం గమనార్హం. ఇదే ఘటనపై ఛత్తీస్ గఢ్ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. ఈనెల 3వ తేదీన బీజాపూర్ జిల్లాలోని తొర్రెం-జీరగూడెం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో 23 మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వికల్ప్ పత్రికా ప్రకటన జారీ చేయడం గమనార్హం.
అయితే నక్సలైట్లపై గగనతలం నుంచి డ్రోన్ల ద్వారా బాంబుల కురిపించారనే వాదనను తెలంగాణాలోని సీనియర్ పోలీసు అధికారులు కొందరు తోసిపుచ్చుతున్నారు. ఇది అసాధ్యమైన ప్రక్రియగా తన పేరు రాయడానికి నిరాకరించిన ఓ పోలీసు అధికారి స్పష్టం చేశారు. గగనతలం నుంచి బాంబులు విసరడానికి ఎయిర్ ఫోర్స్ సహకారం అవసరమని, ఇందుకు అనేక నిబంధనలు ఉంటాయని, ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. అంతేగాక స్థానిక పోలీసులు ఈ తరహా దాడుల్లో నిష్ణాతులు కాదని, ఇందుకు ప్రత్యేక శిక్షణ అవసరమని ఆయన అన్నారు. బహుషా అక్కడ జరిగింది గ్రెనేడ్ దాడులు కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా తమను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల ద్వారా బాంబులు కురిపించారని నక్సల్ నేత వికల్ప్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.