మహారాష్ట్రలోని నాసిక్ ఆసుపత్రిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక 22 మంది కరోనా రోగులు మరణించారు. నాసిక్ నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న జాకీర్ హుస్సేన్ కోవిడ్ ఆసుపత్రిలో ఈ దుర్ఘటన జరిగింది. ఆక్సిజన్ సరఫరాలో లోపం వల్లే 22 మంది కరోనా రోగుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆక్సిజన్ సరఫరా లోపమే ఇందుకు ప్రధాన కారణమని నాసిక్ కలెక్టర్ కూడా ప్రకటించారు. కోవిడ్ ఆసుపత్రి ఆవరణలోని ఆక్సిజన్ టాంకర్ నింపుతుండగా లీకేజీ ఏర్పడిందనే వార్తలు వస్తున్నాయి. టాంకర్ లీకేజీ వల్లే రోగులకు అందాల్సిన ఆక్సిజన్ లో తీవ్ర అంతరాయం ఏర్పడి మరణాలు సంభవించినట్లు చెబుతున్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.