తెలంగాణా మినీ మున్సిపల్ పోరులో ఇదో ఆసక్తికర సన్నివేశం. మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్లను కొందరు నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన పార్టీ కార్యకర్తల ఆవేదన పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఇదే ఆరోపణలతో కరపత్రాలు వదిలి వెళ్లిన ఘటన వరంగల్ మహానగరంలో కలకలానికి దారి తీసింది. గ్రేటర్ వరంగల్ లోని ఎల్బీ కాలేజ్ మీడియా పాయింట్ వద్ద ఆయా ఆరోపణల సాారాంశంతో కరపత్రాలు వెలువడడం పెను సంచలనాన్ని కలిగిస్తోంది. పార్టీ టికెట్ ఆశించిన అభ్యర్థుల నుంచి నాయకులు రూ. 30 నుంచి రూ. 50 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నట్లు ఆయా కరపత్రాల్లో ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్నవారికి బీ ఫారం వస్తుందా? రాదా? అనే ఉత్కంఠను ఆయా రాజకీయ పార్టీకి చెందిన టికెట్ ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి తమ పార్టీ ముఖ్యులకు ట్విట్టర్ ద్వారా విషయాన్ని చేరవేసినట్లు కూడా గుర్తు తెలియని వ్యక్తులు వదలి వెళ్లిన కరపత్రాల్లో పేర్కొన్నారు.
కాగా ఖమ్మం కార్పొరేషన్ లో కూడా కార్పొరేటర్ టికెట్లను ఆశిస్తున్నవారి నుంచి ఇదే తరహాలో భారీ మొత్తాన్ని ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలు వసూల్ చేయించారనే ప్రచారం జరుగుతోంది. టికెట్ ఆశించే ప్రతి వ్యక్తి నుంచి రూ. 50 లక్షల చొప్పున వసూల్ చేశారనేది ఆయా ప్రచారపు సారాంశం. ఆయా భారీ మొత్తాన్ని పార్టీ ఫండ్ పేరుతో ముందుగా ‘డిపాజిట్’ చేసినవారికి మాత్రమే టికెట్లు లభిస్తాయని, ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చును తమ చేతుల మీదుగానే వ్యయం చేస్తామని ముఖ్యనేతలు చెబుతున్నారని ఆయా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా బీ ఫారాలు అందడానికి ముందే భారీ ఎత్తున డబ్బు మొత్తాన్ని వసూల్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆయా రాజకీయ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.