మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (67) ఇక లేరు. కరోనా మహమ్మారి ఆయనను గురువారం రాత్రి పొద్దుపోయాక కబలించింది. కరోనా బారిన పడిన చందూలాల్ మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గ రాజకీయాల్లో చందూలాల్ తనకంటూ ప్రత్యేక చరిత్రను కలిగి ఉన్నారు. దివంగత ఎన్టీఆర్, మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత తెలంగాణా సీఎం కేసీఆర్ లతో చందూలాల్ రాజకీయ అనుబంధాన్ని కలిగి ఉన్నారు.
సాధారణ బంజారా కుటుంబంలో జన్మించిన చందూలాల్ రాజకీయంగా సర్పంచ్ నుంచి మంత్రి స్థాయికి ఎదిగారు. తన రాజకీయ ప్రస్థానంలో భాగంగా 1981-1985 జగ్గన్నపేట్ సర్పంచ్ గా ఎన్నికైన చందులాల్ 1985-1989 లో తొలిసారి అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే పోరీక జగన్నాయక్ పై విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా 1994-996 రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1996లో 11వ లోకసభ సభ్యునిగా వరంగల్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1998 ఎన్నికల్లో కూడా వరంగల్ నుంచే రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ లో చేరిన చందూలాల్ ములుగు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో మరోసారి ఎన్నికయ్యారు. చందూలాల్ కు ఓ కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు.