తెలుగు భాషను కాపాడడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు దాని గొప్పతనాన్ని తియ్యదనాన్ని గురించి వ్యాసాలు రాస్తున్నారు. ఉపన్యాసాలు ఇస్తున్నారు. మరి కొందరు ప్రత్యేక వేదికలు నడుపుతూ తెలుగును కీర్తిస్తున్నారు. ఇంకొందరు అచ్చతెలుగు పదాలను వెతికి తీసే కృషి సాగిస్తున్నారు. కొన్ని పెద్ద మీడియా సంస్థలైతే ఆంగ్లంలోని సాంకేతిక పదాలను తెలుగు చేయిస్తున్నాయి. తల్లి భాష తెలుగు కనుమరుగు కాకుండా ఎల్లకాలం వెలగాలనేదే వీరందరి తపన, తెలుగు సమాచార సాధనాల్లో అంతా తెలుగులోనే ఉండాలన్న వీరి ఆకాంక్ష మెచ్చుకోదగినది
ఏ కృషి అయినా, ప్రయత్నమయినా గురి తప్పకుండా జరిగినప్పుడే అది ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది, బాణం గురికి బారెడు దూరంలో పడితే ఏమి లాభం? లాభం అనే దాన్ని ప్రయోజన అర్ధంలో కొన్ని ప్రాంతాల్లో వాడుతారు. చూపు లేమి వారు క్షమించాలని వేడుకుంటూ ఇక్కడ ఒక సామెతను చెబుతాను, గుడ్డెద్దు చేనులో పడినట్టు అంటారు, తెలుగును తిరిగి విస్తారంగా వినియోగంలోకి రప్పించడానికి, అది అంతరించిపోకుండా ఆదుకోడానికి జరుగుతున్న పాటును తలచుకుంటే ఈ సామెత గుర్తుకు వస్తుంటుంది.
ఒక సమాజ నడవడిక మీద గాని, అక్కడి ప్రజలు ఆదరించి పాటించే విలువల మీద గాని, వారి భాష సంస్కృతుల పైన గాని ఆ జన సమూహ సారధుల దృష్టి కోణం ప్రభావం గట్టిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. బ్రిటిష్ సమాజం రాచరిక అవశేషాలను ఇప్పటికీ నెత్తిన పెట్టుకుని పోషిస్తున్నప్పటికీ ఆచరణలో ప్రజాస్వామిక విధి విధానాలను అక్కున చేర్చుకున్నది. అమెరికా కూడా ప్రజాస్వామ్యాన్నే ఎంచుకున్నది. అక్కడ అప్పుడప్పుడు బుసలుకొట్టి కాటేసే తెల్లతోలుతనం దాని బలహీనతను బయటపెడుతుంది. సంపూర్ణ ప్రజాస్వామ్యం అనేది బహుశా ప్రపంచంలో ఎక్కడా బలంగా వేళ్లు ఊనుకోలేదు అయితే తరతమ తేడాలతో కొన్ని చోట్ల మెరుగైన ప్రజాస్వామ్యముంది. మన దేశంలో కూడా తెలుగు నేలలో ఉన్నదానికంటే మించిన ప్రజాస్వామిక చైతన్యమున్న రాష్ట్రాలు ఉన్నాయి. మన పెద్దలు మాత్రం ఇప్పటికీ గత కాలపు భావాలకు పట్టం కడుతూ సమాజ చక్రాన్ని వెనుక పట్టు పట్టిస్తూనే ఉన్నారు. పై వర్గాల అభిరుచులకే మనం ప్రాధాన్యం ఇస్తున్నాము. భాష విషయంలో సైతం ఇదే జరుగుతున్నది ఉగాది నాడు ఇంకా ఆశాస్త్రీయ పంచాంగ పఠనమే సాగుతోంది. వానల రాకడపై పంతులుగారి మిడతంబొట్ల జోస్యాలే రాణిస్తున్నాయి. వాతావరణ శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందింది కదా ఆ విజ్నులను రప్పించి వారి శాస్త్రీయ జోస్యాలు చెప్పించుకోవచ్చు కదా!
అటువంటి ఆలోచనే మనలో చొరబడదు
వ్యావహారిక భాషను రచనకు ఆలంబనగా చేసుకోవాలని ఏనాడో అనుకున్నాము గాని అది ఈనాటికీ పూర్తి ఆచరణలోకి రాలేదు. పాలక తెలుగులోనైతే గ్రాంధిక వాక్యాంతాల చెదలు వదల్లేదు. పై వర్గాలకు మాత్రమే రుచించే సంస్కృతాంధ్రం కౌగిలిలోనే సుఖిస్తున్నాం. వ్యావహారికానికి భిన్న స్థాయిలో శిష్టవ్యావహారికం అన్నారు అంటే భావార్ధానికి నాలుకకు లంకె కుదిరి సాధారణ జనం గుండెల్లో గుబాళించి వెలువడేదంతా దుష్ట భాష అనే కదా! ఈ విధంగా మన భాషా సేద్యమంతా పాషాణ దారుల్లోనే సాగుతున్నది.ఇందుకు ముఖ్య కారణం మనం జనం నాలుకతో మమేకం కాకుండా పై వర్గాల విలువలను అనుదిన వలువలుగా ధరించడమే. వికలాంగులు అన్నారు, దానిని ఇప్పుడు దివ్యాంగులు చేశారు, అవిటివారు అనే మాట అర్ధం అయ్యేంతగా ఇవి అర్ధం అవుతాయా? అవిటివారు అనే పదంలో నీచార్ధం ఏముంది?
మాతృ భాషను అమ్మ మాట, తల్లి నాలుక, పుట్టు పలుకు, ఇంటి ఇంపు అని కూడా అనొచ్చు కదా! చెప్పదలచుకున్న విషయాన్ని వీలైనంత సులభంగా బలంగా చేర్చేదే మంచి భాష, పదకోశాలను వెతికి తెలుసుకోవాల్సిన అవసరం కలిగించేది భాష ఎలా అవుతుంది? చదువుకున్నవారు సంక్రాంతి అంటారు, సాధారణ జనం ఆ మాటను ఎప్పుడూ వాడరు వాడలేరు, సంకురేతిరి, పెద్దపండుగ అంటారు. దీపావళిని దీపాల అమావాస్య అంటారు, యుగాది ఉగాది అయినట్టే ప్రజల నాలుకకు పట్టే అలవి అయ్యే భాష మాత్రమే నిలబడుతుంది. ఇందుకు విరుద్ధంగా మర తర్జుమాలతో కృతక భాషాంతరీకరణలతో తెలుగుకు చెప్పరాని పరువు నష్టం కలిగిస్తున్నారు
Outer ring road కు బాహ్యవలయదారి అనమంటారు, active case లను క్రియాశీల కేసులు అంటున్నారు, నయం ‘కార్య ‘శీల అనమనలేదు! చుట్టుదారి అనేది వాడుకలో ఉంది, ఆ మాత్రం లోక భాష తెలియదా! నోరున్న వాడిదే ఊరు అయిపోతే ఎలా, జనం గొర్రెలా! ఇంకా చెప్పుకోవాలంటే ఎన్నెన్నో, అంతర్జాలం అంటూ internet అర్ధాన్ని పాతాళంలో పాతేశారు. మంచినీరును తాగుబోతుల తాగునీరుగా మార్చారు. nomination కు ఏ బురదగుంట నుంచి తెచ్చారో నామపత్రం అని.
మిగతా అన్ని ప్రాంతీయ భాషలకు ఉన్నట్టే తెలుగుకు కూడా అనేక పరిమితులున్నాయి, పరిణతి బొత్తిగా, శాస్ట్రీయత ఆవంత అయినా లేని రోజుల్లో ఆర్య దురాక్రమణదారులు నోటికొచ్చిందల్లా పలికితే వాటిని వేదాలని అపౌరషేయాలని కీర్తిస్తూ అన్నీ అందులోనే ఉన్నాయనే భ్రమలు కల్పిస్తూ మొద్దు నిద్రలో శతాబ్దాలు దొర్లించుకుపోతున్న మనకు పాశ్చాత్య నూతనఆవిష్కరణలు వెలుగుల జడివానలా మతి పోగొడుతున్నాయి. వారి భూమ్మీద వారు కనుగొంటున్న కొత్త సాంకేతిక విప్లవాలకు చెందిన పారిభాషిక పదాలను ఉన్నవి ఉన్నట్టు తీసుకుని మన పాఠక ప్రజలకు అందించడమే మంచి పద్ధతి. ఇక్కడ కూడా మనకు ఆస్థిగతమైన అంటరానితనాన్ని పాటిస్తున్నాము. వాటికి తగిన అర్ధం ఇచ్చే పదాలు మన భాషలో లేవని తెలిసికూడా అసహజ అర్ధవిహీన పద బంధాలను సృష్టించి మన పాఠకులకు పలుకు నరకాలను చూపిస్తున్నాము.
ఈ మధ్య ప్రజలు వాడే ఆంగ్ల పదాలను యధాతధంగా దించేసి వాటికి వాడుకలో ఉన్న తెలుగును కూడా ఉపయోగించకుండా తెంగ్లీష్ వాక్యాలతో వార్తలు అభిప్రాయాలూ ప్రచురించే ధోరణి కూడా మొదలయింది. ఈ సంపాదక మాన్యులు కాన్స్టిట్యూషన్, కాంషస్ నెస్ , హెయిట్, వెయిట్ అనేవాటిని కూడా తెలుగు వార్తల రచనలో వినియోగిస్తున్నారు. పదాల పరిపుష్టత ఉన్నంత మేరకయినా తెలుగును వాడకపోడం కంటే దౌర్భాగ్యం ఏముంటుంది?అచ్చ తెలుగు పేరుతో మరో దుకాణం వెలిసింది, దీనిని వింటేనే జనం హడలెత్తిపోతారు. మమ్మీలను తెచ్చి నాలుకలకు అద్దు తున్నారు.
ఇలా ఎవరికి చేతనైన పద్ధతుల్లో వారు తెలుగును నిలువెత్తు గోతిలో పాతేస్తుంటే దానికి ఉజ్వల భవిష్యత్తు ఏ విధంగా సిద్ధిస్తుంది? జన భాష వాడకుండా ప్రజల నాలుకలను పరిశీలించి వాటిల్లోని జీవ భాషను సేకరించి వినియోగించకుండా తెలుగును కాపాడుకోవాలని తాపత్రయపడడం నేలవిడిచిన సామూగానే అభాసుపాలు అవుతుంది.
మీడియా ఈ విధంగా తెలుగును చిత్ర వధ చేస్తుంటే సామాన్య జనం ఓటుతో అధికారం చేజిక్కించుకుంటున్న పాలకులు ప్రభుత్వాలయినా ప్రజల భాష పరిరక్షణకు నడుము బిగించకపోడం మరింత బాధ కలిగిస్తున్నది
జన భాష ఒక్కటే జీవ భాష, తెలుగును కాపాడజాలదు పాండిత్య కంఠ సోష.
– శ్రీరామ మూర్తి
సీనియర్ ఎడిటర్
(ఫేస్ బుక్ వాల్ నుంచి కృతజ్ఞతలతో…)