భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మంగళవారం భారీ మొత్తపు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ కథనం ప్రకారం… ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావనం గ్రామం వద్ద ఎస్సై మహేష్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో కొత్తగూడెం నుండి ఖమ్మం వైపుగా వెళుతున్న AP28 W 8974 అనే నెంబరు గల ఐచరు వ్యానును ఆపి తనిఖీ చేయగా, 22 క్వింటాళ్ల (2200కేజీలు) బరువు గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారుగా 3,31,50,000/- (మూడు కోట్ల ముప్పై ఒక్క లక్ష యాభై వేలు) రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.
అనంతరం పట్టుబడిన టోలీచౌక్ కు చెందిన వెహికల్ డ్రైవర్ షేక్ మహబూబ్ ను విచారించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా చింతూరు అటవీ ప్రాంతం నుండి ఈ గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తేలిందని ఎస్పీ చెప్పారు. ఈ గంజాయిని తరలించడంలో నిందితుడికి సహకరించిన మిగతా వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. నిందితులపై Cr.no.37/2021 U/s.8(c) r/w 20(b) of NDPS యాక్ట్ ప్రకారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. పట్టుబడిన నిందితుడు షేక్ మహబూబ్ ను జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. కాగా భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న చుంచుపల్లి ఎస్సై మహేష్ ను, సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ దత్ అభినందించారు.