తమ చెరలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఫొటోను మావోయిస్టు పార్టీ నక్సలైట్లు బుధవారం విడుదల చేశారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా తారెం అడవుల్లో ఈనెల 3వ తేదీన జరిగిన భారీ ఎన్కౌంటర్ సందర్భంగా సీఆర్పీఎఫ్ జవాన్ రాజేశ్వర్ సింగ్ మాన్సాన్ ను నక్సలైట్లు బందీగా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్దిష్టంగా మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమవద్ద బందీగా ఉన్న జవాన్ ను విడుదల చేస్తామని, అప్పటి వరకు అతను జనతన సర్కార్ల రక్షణలో క్షేమంగా ఉంటాడని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ నిన్న ఓ ప్రకటనలో వెల్లడించిన విషయం కూడా విదితమే.
ఈ నేపథ్యంలోనే తమ వద్ద బందీగా ఉన్నటువంటి జవాన్ రాజేశ్వర్ సింగ్ మాన్సాన్ ఫొటోను నక్సలైట్లు కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. టీషర్ట్, ప్యాంటు ధరించిన జవాన్ రాజేశ్వర్ సింగ్ మాన్సన్ తాటి ఆకుల పాకలో కూర్చుని ఏదో ప్రశ్నిస్తున్నట్లు ఉన్న ఫొటోను నక్సల్స్ విడుదల చేశారు. రాజేశ్వర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు ఫొటో చెప్పకనే చెబుతోంది.