ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఘటన ఆ రాష్ట్ర పోలీసు శాఖలో తీరని విషాదాన్ని నింపింది. నిన్నటి ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించినట్లు ప్రాథమికంగా వెలుగులోకి రాగా, ఆదివారం ఉదయం వరకు ఈ సంఖ్య ఎనిమిదికి పెరిగినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. గాయపడినవారిలో ముగ్గురు జవాన్లు చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయా వార్తల సారాంశం. ఇదే దశలో ఛత్తీస్ గఢ్ మీడియాకు చెందిన రెండు ప్రముఖ న్యూస్ ఛానళ్ల జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో చిత్రీకరించినట్లు పేర్కొంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని తొర్రెం అడవుల్లోని ఓ ఇప్పచెట్టు కింద, దాని పరిసరాల్లో 20 నుంచి 21 మంది జవాన్ల శవాలు ఉన్నట్లు చిత్రీకరించిన వీడియోలు ఎన్కౌంటర్ తీవ్రతను తెలియజేస్తున్నాయి. నిన్నటి ఎన్కౌంటర్ లో అనేక మంది జవాన్ల ఆచూకీ లభించడం లేదనే వార్తల నేపథ్యంలో ఈ వీడియోలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది.