వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను జాతీయ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, వచ్చే సాధారణ ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని శ్రీకాంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే జాతీయ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతారా? లేక బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గట్టు శ్రీకాంత్ రెడ్డికి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజకీయంగా పొసగదని, శ్రీకాంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో పనిచేసిన నేపథ్యం ఉండడం వల్ల ఆయన బీజేపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.