ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ఐదుగురు పోలీసులు మరణించారు. ఇదే ఘటనలో మరికొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఛత్తీస్ గఢ్ డీజీపీ డీఎం అవస్థీ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం… నక్సల్స్ ఏరివేత భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతుండగా, బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని తొర్రెం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించగా, మరికొందరు గాయపడినట్లు డీజీపీ అవస్థీ వివరించారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా బలగాలు నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ లో పాల్గొన్నట్లు చెప్పారు. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా గత నెల 23వ తేదీన నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్ మందుపాతర పేల్చిన ఘటనలో ఐదురుగు పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే.