ఖమ్మం నగర పోలీసులు నాలుగేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరును కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఖమ్మం డీసీసీబీలో నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై బ్యాంకు సీఈవో అట్లూరి వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత పాలకవర్గం నేతలపై కేసు నమోదైంది. ఈమేరకు అప్పటి డీసీసీబీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబు, వైస్ చైర్మెన్ భాగం హేమంతరావులు సహా మొత్తం 21 మంది డైరెక్టర్లపై ఖమ్మం త్రీటౌన్ పోలీసులు ఐపీసీ 403, 406, 409, 420 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ లో 11వ నిందితునిగా పేర్కొన్న బోడేపూడి రమేష్ బాబు అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితమే చనిపోయారు. ఇటీవలే ఆయన నాలుగో వర్ధంతిని కూడా నిర్వహించారు. రమేష్ బాబు గత పాలకవర్గంలో డైరెక్టర్ గా, కొండాయిగూడెం సొసైటీ చైర్మెన్ గా పనిచేశారు. అయితే తమకు అందిన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. కాగా చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం తప్పేమీ కాదని, తదుపరి దర్యాప్తులో అతని పేరును తొలగిస్తారని పోలీసు వర్గాలు చెప్పాయి.