మావోయిస్టు పార్టీ అగ్రనేత రామన్న మృతి వార్తను ఆ పార్టీ మీడియా ప్రతినిధి వికల్ప్ ఇప్పటికే ధృవీకరించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ మృత దేహానికి తెలంగాణా సరిహద్దుల్లోని పామేడు-బాసగూడ అడవుల్లో అంత్యక్రియలు జరిగినట్లు తమకు సమచారం ఉందని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించిన సంగతీ తెలిసిందే.
అయితే రామన్న అంత్యక్రియలను మావోయిస్టు పార్టీ నక్సల్స్ స్వయంగా నిర్వహించినట్లు తాజాగా లభ్యమైన ఫొటోలు కొన్ని స్పష్టం చేస్తున్నాయి. సాయుధ నక్సలైట్లు రామన్న అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు కూడా ఫొటోలను నిశితంగా పరిశీలిస్తే స్పష్టమవుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన IBC 24 న్యూస్ ఛానల్ ఈ ఫొటోలను సంపాదించడం విశేషం. ఇప్పటివరకు సాయుధుడైన రామన్న ఫొటోలు మాత్రమే పోలీసుల వద్ద ఉండగా, చనిపోవడానికి ముందు రామన్న అసలు రూపంతో కూడిన ఫొటో కూడా ఆయా ఛానల్ సేకరించింది. అంతేగాక రామన్నపార్టీకి చేసిన సేవలను కొనియాడుతూ మావోయిస్టు పార్టీ మీడియా అధికార ప్రతినిధి వికల్ప్ పేరున హిందీలో కరపత్రాలు కూడా పంపిణీ చేశారు.