వి.కా.స…. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ! సి.కా.స., ఆ.కా.స… ఈ పేర్లనూ ఎప్పుడో విన్నట్లు గోచరిస్తున్నదా? ఇవి మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థలు. ఉమ్మడి రాష్ట్రంలో పీపుల్స్ వార్ నక్సల్స్ ఆధిపత్యం సాగిన కాలంలో కార్మికవర్గాల్లో గట్టి పట్టు సాధించిన సంస్థలు. సింగరేణి కార్మిక సమాఖ్యను క్లుప్తంగా సికాస…గా, ఆర్టీసీ కార్మిక సమాఖ్యను ఆకాస…గా, విప్లవ కార్మిక సమాఖ్యను వికాస…గా ఒకప్పటి పీపుల్స్ వార్ నక్సల్ సంస్థ వ్యవహరించేంది. సికాస నుంచి పుట్టుకొచ్చినవే ఆకాస. వికాస సంస్థలు. తెలంగాణాలో నక్సల్ కార్యకలాపాలు ముఖ్యంగా మావోయిస్టు పార్టీ మళ్లీ వేళ్లూనుకోకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రంలో పట్టుకోసం మావోయిస్టు పార్టీ వివిధ రూపాల్లో చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు. ఇటీవలే సికాస పునర్ నిర్మాణం కోసం చేసిన ప్రయత్నాలను రామగుండం పోలీసులు భగ్నం చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం దంపతులను పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ విప్లవ కార్మిక సమాఖ్య (వికాస) పేరుతో వెలువడిన ఓ ప్రకటన పోలీసు వర్గాలను అప్రమత్తం చేసింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం వచ్చే నెల 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే నిరసన దీక్షకు తాము సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్లు వికాస కార్యదర్శి ఆజాద్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. ఇప్పుడీ ప్రకటన తెలంగాణా పోలీసు వర్గాల్లో కలకలాన్ని కలిగిస్తోంది. సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన కార్మిక సంఘాల్లో నక్సల్స్ పట్టుకోసం ప్రయత్నిస్తున్నారా? అనే సంశయాలను పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచార సేకరణలో ప్రభుత్వ నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి.