‘నన్ను ఓడించడానికి అధికారులు, నాయకులు ఇన్ని కుట్రలు పన్నారని నాకు తెలియదు. ప్రజల్లో గల వంద ప్రశ్నలకు లీకైన ఆడియో సమాధానం చెబుతున్నది. రాజ్యాంగ హోదాలో గల కలెక్టర్ మాట్లాడే పద్ధతి విన్నాను. ఈ అంశం నా పరిధిలోది కాదు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెడతాను.’
సరిగ్గా నెల రోజుల క్రితం…అంటే గత నవంబర్ 16వ తేదీన తెలంగాణా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు ఇవి.
ఇందుకు దారి తీసిన నేపథ్యం గుర్తుంది కదా? బీజేపీకి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఆడియో లీకైన సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ఆయా విధంగా స్పందించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులుగా గంగుల కమలాకర్, బండి సంజయ్ కరీంనగర్ స్థానం నుంచి పరస్పరం తలపడ్డారు. ఈ ఎన్నికల సందర్భంగా కమలాకర్ చేసిన ఖర్చు, నివేదికల విషయంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సంజయ్ కు సహకరించే విధంగా వ్యవహరించారన్నది అధికార పార్టీ నేతల ఆరోపణ. అప్పటి ఎన్నికల్లో కమలాకర్ విజయం సాధించగా, సమీప ప్రత్యర్థిగా సంజయ్ నిలిచారు. అయితే ఎన్నికల నిబంధనల పరిమితిని దాటి కమలాకర్ ఖర్చు చేశారని, అతన్ని డిస్ క్వాలిఫై చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత పరిణామాల్లో లోక్ సభ ఎన్నికలు జరగడం, అనూహ్యంగా సంజయ్ ఎంపీగా ఎన్నిక కావడం తెలిసిందే. కానీ అకస్మాత్తుగా గత నెల 16వ తేదీన కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ల మధ్య జరిగినట్లు పేర్కొన్న ఓ ఆడియో సంభాషణ లీక్ కావడం రాజకీయ కలకలానికి దారి తీసింది. ఖర్చు, లోపాలు, అనర్హత వంటి అంశాలు ఈ ఆడియో సంభాషణలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ అప్పట్లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కలెక్టర్ పై బదిలీ వేటు తప్పదనే వాదనలు వినిపించాయి. ఇందుకు బలం చేకూర్చే విధంగా సోమవారం కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ, కరీంనగర్ కొత్త కలెక్టర్ గా శశాంకను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.