వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపులో టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ ఎలిమినేట్ కాక తప్పదా? రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రక్రియలో లభిస్తున్న ఆధిక్యతలు ఇదే సందేహాన్ని కలిగిస్తున్నాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ విజయం దక్కకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాాజాగా 66వ రౌండ్ ఓట్ల లెక్కింపు అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,15,588 ఓట్లను, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న 90,379 ఓట్లను, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ 75,575 ఓట్లను కలిగి ఉన్నారు. సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే దశలో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలకు లభించిన ఓట్లలో రెండో ప్రాధాన్యత లెక్కింపు కొనసాగుతోంది.
ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ 29,441 ఓట్లను, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి 41,328 ఓట్లను కలిగి ఉన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థుల ఓట్ల సంఖ్య ప్రస్తుతం 70,769 కాగా, వీరి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, మిగిలినవారిలో ఎవరికి ఆధిక్యత లభిస్తుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీన్మార్ మల్లన్న, కోదండరామ్ ల మధ్య ప్రస్తుతానికి 14,804 ఓట్ల వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు గల మొత్తం 70,769 ఓట్లలో కనీసం సగం ఓట్లను రెండో ప్రాధాన్యతలో కోదండరామ్ దక్కించుకుంటే తప్ప తీన్మార్ మల్లన్నను నెట్టేసి రెండో స్థానంలోకి వెళ్లే అవకాశం లేదు. కానీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో లభిస్తున్న ఓట్ల సరళి ఇందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. తీన్మార్ మల్లన్న సైతం రెండో ప్రాధాన్యత ఓట్లలో తన సత్తా చాటుతుండడమే ఇందుకు కారణం. ఈ సరళి ఇలాగే కొనసాగితే చివరికి పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్నల మధ్యే ఆఖరి పోరాటం జరగవచ్చంటున్నారు. మొత్తంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను కలిగిస్తోంది.