అధికార పార్టీ అండదండలు… ఆర్థిక, అంగబలం పుష్కలం… మందీ, మార్బలానికి కొదువేమీ లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక లీడర్లు, ప్రతి యాభై మంది ఓటర్లకు ఓ ఇంచార్జ్… వెరసి అద్భుతమైన ‘పోల్ మేనేజ్మెంట్’ నైపుణ్యం. ఏ రకంగా చూసినా పోటీలో గల మిగతా అభ్యర్థులకన్నా వెయ్యి రెట్ల మెరుగైన శక్తి, సామర్థ్యాలు….ఇవేవీ వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని సునాయసంగా విజయతీరానికి చేర్చలేకపోతున్నాయా? ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సరళి ఇదే ప్రశ్నను రేకెత్తిస్తోందని రాజకీయ పరిశీకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడ గల ఓ టేబుల్ ను ఓసారి నిశితంగా పరిశీలించండి…
ఈ పట్టిక చెబుతున్న సారాంశమేమిటో తెలుసా….? ప్రధాన పార్టీల సంగతి ఎలా ఉన్నప్పటికీ, పెద్దగా నిర్మాణం లేని టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాంతోపాటు ఏ నిర్మాణమూ లేని స్వతంత్ర అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటుండడమే ఆసక్తికర పరిణామం. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోలింగ్ అనంతరం వివిధ వర్గాలు ప్రభుత్వానికి నివేదించిన సారాంశం వేరు. కానీ అనూహ్యంగా తీన్మార్ మల్లన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి సమీప ప్రత్యర్థిగా దూసుకురావడమే ఇప్పుడు రాజకీయ సంచలనం కలిగిస్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన నాలుగు రౌండ్ల ఫలితాల అనంతరం ‘రేసు’లో గల ఏ అభ్యర్థి కూడా తొలి ప్రాధాన్యత ఓటు ద్వారా విజయం సాధించే అవకాశాలు లేవని ఆయా పట్టికలోని గణాంక వివరాలే స్పష్టం చేస్తున్నాయి.
ఎక్కువ ఉపోద్ఘాతంలోకి వెళ్లకుండా ఫలితాల వివరాలను పరిశీలిస్తే… ఇప్పటి వరకు నాలుగు రౌండ్లలో మొత్తం 2,23,981 ఓట్లను లెక్కించారు. అందులో చెల్లని 12,475 ఓట్లను మినహాయిస్తే 2,11,506 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రకారం… నాలుగు రౌండ్లలో లెక్కించగా చెల్లుబాటైన ఓట్లలో 50+1 ఓటు శాతం ప్రామాణికంగా ఏ అభ్యర్థి విజయం సాధించాలన్నా మేజిక్ ఫిగర్ 1,05,754 ఓట్లను సాధించాలి. కానీ వరుసగా నాలుగు రౌండ్ల ఫలితాల్లోనూ ఆధిక్యంలో గల ‘పల్లా’ రాజేశ్వర్ రెడ్డికి ప్రస్తుతం లెక్కించిన ఓట్లలోనే తొలి ప్రాధాన్యత విజయం దక్కడానికి మరో 42,312 ఓట్లు కావాలి. అదేవిధంగా రెండో స్థానంలో గల తీన్మార్ మల్లన్నకు 57,750 ఓట్లు, మూడో స్థానంలో గల ప్రొఫెసర్ కోదండరామ్ కు 66,139 ఓట్లు, నాలుగో స్థానంలో గల బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 82,051 ఓట్లు కావాలి. కానీ ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం తొలి ప్రాధాన్యతలో ఎవరికీ విజయం దక్కే సూచనలే కనిపించడం లేదు.
అదేవిధంగా ప్రస్తుతం అయిదో రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇదిగాక ఇంకో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాలి. ప్రతి రౌండ్ కు 56 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. అంటే ఇంకా దాదాపు 1.70 లక్షల ఓట్లను లెక్కించాలి. నాలుగు రౌండ్ల ఫలితాల్లోనూ సగటున మూడు వేలకు పైగా ఓట్ల చొప్పున చెల్లకుండాపోయాయి. ఈ లెక్క ప్రకారమే గరిష్టంగా మరో పది వేల ఓట్లు చెల్లనివిగా తేలవచ్చు. ఇక మిగిలిన దాదాపు 1.60 వేల ఓట్లలో నలుగురికి దక్కే నిష్ఫత్తిని గణిస్తే వెల్లడైన నాలుగు రౌండ్ల ఫలితాల ప్రకారమే విభజించాలి. ఆధిక్యంలో గల పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇందులో కనీసంగా 1.20 లక్షల ఓట్లు ఏకపక్షంగా కైవసం చేసుకుంటే తప్ప తొలి ప్రాధాన్యతలోనే ఆయన విజయం సాధించే పరిస్థితులు లేవు. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే… ఈ ఎన్నికల్లో పట్టభద్రులు ఏకపక్ష తీర్పునివ్వలేదని స్పష్టమవుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యంగా గోచరిస్తోంది. ఈ లెక్కింపులో ఎవరు ‘ఎలిమినేట్’ అవుతారో, మరెవరు ముందుకు వస్తారో, ఇంకెవరు వెనక్కి నెట్టబడుతారో తెలియని ఉత్కంఠ స్థితి నెలకొంది. అంతేకాదు వెల్లడి కావలసిన మరో మూడు రౌండ్ల ఫలితాల సరళి కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల బలాబలాలను తారుమారు చేసే అవకాశం లేకపోలేదు. మొత్తంగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం అత్యంత ఉత్కంఠభరితం. అదీ విషయం.