గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఆరేళ్ల క్రితం నాటి సీన్ రిపీట్ అవుతున్నదా? అప్పటి ఎన్నికల ఫలితాల సరళిలోనే ప్రస్తుత ఫలితాలు కనిపిస్తుండడం విశేషం. గత ఎన్నికల సందర్భంగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలినట్లు గణాంక వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన నాలుగు రౌండ్ల ఫలితాల్లో ప్రధాన పోటీలో నిలిచిన తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరాం, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాములు నాయక్ లకు కలిపి మొత్తం 1,27,256 ఓట్లు లభించాయి. ఆధిక్యంలో గల అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 63,442 ఓట్లు దక్కాయి. గత ఎన్నికల సందర్భంగా 2015 మార్చిలో వెల్లడైన ఫలితాల్లో ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే…
తొలి ప్రాధాన్యత ఓట్ల ద్వారా గతంలోనూ ఎవరికీ విజయం దక్కలేదు. బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్ రావుపై 11,940 రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధిక్యతతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపును సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను ఎలిమినేట్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అప్పటి ఎన్నికల్లో మొత్తం లక్షా 53 వేల 547 ఓట్లు పోల్ కాగా, ఇందులో 14,039 ఓట్లు చెల్లలేదు. మొత్తం లక్షా 51 వేల 413 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో 50 శాతంకన్నా ఒక్క ఓటు ఆధిక్యత ప్రామాణికంగా గెలుపునకు అవసరమైన మేజిక్ ఫిగర్ 66,777 ఓట్లకు గాను, రెండో ప్రాధాన్యత ఓట్లతో 67,183 ఓట్లతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రావుకు 55,243 ఓట్లు వచ్చాయి. అప్పటి ఎన్నికల్లో మొత్తం 22 మంది పోటీ చేయగా, ఎవరికీ ఆధిక్యత లభించలేదు. తొలి ప్రాధాన్యతలో రాజేశ్వర్ రెడ్డి 59,764 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రావు 47,041 ఓట్లు సాధించారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 13,033 ఓట్లు మాత్రమే లభించాయి. వామపక్షాల అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి 11,580 ఓట్లు లభించగా, పోటీ చేసిన మిగతా 18 మంది అభ్యర్థులకు 2,154 ఓట్లు మాత్రమే లభించడం గమనార్హం.
అయితే ఈసారి నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికే తొలి ప్రాధాన్యతలో పల్లా రాజేశ్వర్ రెడ్డి 63,442 ఓట్లను సాధించి, తన సమీప స్వతంత్ర అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై 15,438 ఆధికత్యను కలిగి ఉన్నారు. నాలుగో రౌండ్ ఫలితాల అనంతరం మొత్తంగా తీన్మార్ మల్లన్న 48,004 ఓట్లను, టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం 39,615 ఓట్లను, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి 23,703 ఓట్లను, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ 15,934 ఓట్లను సాధించారు. నాలుగు రౌండ్లలో 12,475 ఓట్లను చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ఈసారి గ్రాడ్యుయేట్ల ఓట్లు గణనీయంగా పెరగడం విశేషం. మొత్తం 3.86 లక్షల ఓట్లు పోలు కాగా, నాలుగు రౌండ్లలో 2.25 లక్షల ఓట్ల వరకు లెక్కింపు పూర్తయింది. దాదాపు మరో లక్షన్నరకు పైగా ఓట్లు మాత్రమే ఇంకా మూడు రౌండ్లలో లెక్కించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆధిక్యంలో గల టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తొలి ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజయం సాధించే అవకాశాలు కనిపించడం లేదు. ఏ రకంగా చూసినా మిగతా మూడు రౌండ్ల లెక్కింపులో ఆయనకు మరో 1.20 లక్షల ఓట్లు లభిస్తే తప్ప మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించే అవకాశాలు మృగ్యమంటున్నారు. దరిమిలా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యం కావచ్చంటున్నారు. కానీ గత ఎన్నికల్లో ‘ఎలిమినేషన్’కు గురైన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రస్తుతం పల్లా రాజేశ్వర్ రెడ్డికి సమీప అభ్యర్థిగా ఉండడం, మరో ముగ్గురు అభ్యర్థులు కూడా గణనీయ ఓట్లను సాధించడం ఆసక్తికర పరిణామంగా భావిస్తున్నారు. వారికి దక్కిన ఓట్లు ప్రామాణికంగా రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి విజయాన్ని చేకూరుస్తాయనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.